తెలంగాణ

telangana

ETV Bharat / city

Gulab Cyclone Effect: గులాబ్ విధ్వంసం.. రహదారులు ధ్వంసం... జనజీవనం అతలాకుతలం

గులాబ్‌ తుపాన్‌ (Gulab Cyclone) ప్రభావంతో కురిసిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 21 వేల చెరువులు అలుగు పోస్తున్నాయి. పలు చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో ఒకరు మృతి చెందారు.

over all story on heavy rains in telangana
over all story on heavy rains in telangana

By

Published : Sep 29, 2021, 6:48 AM IST

నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం గోన్‌గొప్పులకు వెళ్తున్న సిలిండర్‌ లారీ పిల్ల కాలువలో కొట్టుకుపోగా.. డ్రైవర్‌ను పోలీసులు, స్థానికులు రక్షించారు.

నిజామాబాద్‌ నుంచి కాలూర్‌ రహదారిపై వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు తాడు సాయంతో కాపాడారు.

గులాబ్‌ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా 43,870 చెరువులుండగా.. వాటిలో 21,552 పూర్తిగా నిండిపోయి అలుగు పోస్తున్నాయి. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పెద్దచెరువు పుష్కరకాలం తర్వాత నిండింది. పలు చెరువులకు గండి కొట్టాల్సి వచ్చింది. అనేక ఇళ్లు నేలకూలాయి. కొన్నిచోట్ల చెక్‌డ్యాంలు, వైకుంఠధామాలు వరదకు కొట్టుకుపోయాయి. సిరిసిల్ల కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ బయటకు ట్రాక్టర్‌లో రావాల్సి వచ్చింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల వరద ఉద్ధృతి కారణంగా నష్టం వాటిల్లగా.. మరికొన్నిచోట్ల నాసిరకం పనుల కారణంగా దెబ్బతిన్నాయి.

నిజామాబాద్‌ జిల్లాలో 28 రోడ్లు కోతకు గురయ్యాయి. 111 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 900 చెరువులు అలుగుపోస్తున్నాయి. రెండు చెక్‌డ్యామ్‌లు, మూడు కుంటలకు గండిపడింది. సిరికొండ మండలం పెద్దవాల్గోట్‌లో ఇటీవల నిర్మించిన వైకుంఠధామం కొట్టుకుపోయింది. కామారెడ్డి పట్టణ శివారులోని లింగాపూర్‌ పెద్దచెరువు అలుగు మీది నుంచి ద్విచక్రవాహనంపై వెళ్తున్న రైతు భగవంత్‌రెడ్డి వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు.

మునకలో సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని వరదనీరు ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరమగ్గాలు నీటమునగగా.. ముడిసరకు, బతుకమ్మ చీరలు కొంతమేరకు తడిసిపోయాయి. శాంతినగర్‌లో సుమారు 200 ఇళ్లలోకి నీరు చేరింది. కొంతమందిని పునరావాస కేంద్రాల్లోకి అధికారులు తరలించారు. ప్రధాన రహదారులపై రాకపోకలు స్తంభించాయి. కలెక్టరేట్‌ ఆవరణలోకి చేరిన నీటిని రెండు కాలువలు తవ్వి మళ్లించారు. కలెక్టరేట్‌లోకి ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొత్తచెరువు నీటి ఉద్ధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య జేసీబీతో వెళ్లి పలువురిని కాపాడారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, గంభీరావుపేట మండలాల్లో పలు వంతెనలు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి.

కొట్టుకుపోయిన రోడ్లు

పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన రహదారులపై 85.95 కి.మీ. మేర తారు తొలగిపోయింది. దాదాపు 57 కి.మీ. మేర రోడ్డు పక్క భాగం దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి మరమ్మతులకు రూ.7.69 కోట్లు అవసరమని అంచనా. మెదక్‌ జిల్లా చేగుంట మండలంలో 3 పంచాయతీరాజ్‌ రహదారులు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లాలో ఆరుచోట్ల ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం రోడ్లకు రూ.13కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్లా నుంచి రంగనాయక్‌స్వామి ఆలయం వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి మానేరు వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయింది. గతంలో భారీ వర్షాలకు పాక్షికంగా ధ్వంసమైన రోడ్డును ఇటీవలే రూ.2 లక్షలతో పునరుద్ధరించారు. అధికారుల నిర్లక్ష్యం, నాసిరకం పనులతో మళ్లీ కొట్టుకుపోయింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యతాలకుంట, దిబ్బగూడెం మధ్య నాగిరెడ్డివాగు వరద ధాటికి రోడ్డు దెబ్బతింది. యాదాద్రి జిల్లాలో 13 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. కరీంనగర్‌ జిల్లా గోపాల్‌పూర్‌-ఎలబోతారం గ్రామ శివారులో ఇరుకుల్ల వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం కుంభవృష్టికి ముక్కలైంది. ఈ ఏడాది మార్చిలో రూ.8కోట్లతో నిర్మించగా ఇటీవలి వరదలకు మట్టికట్ట కొట్టుకుపోయింది. తాజాగా చెడ్‌డ్యాం ముక్కలైంది.

కార్యాలయంలో చిక్కుకున్న కలెక్టర్‌

సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సోమవారం నుంచి కలెక్టరేట్‌లోనే ఉండి తుపాను ప్రభావాన్ని తెలుసుకుంటున్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌ నుంచి బయల్దేరగా ఎగువ నుంచి భారీగా వచ్చిన వరదనీరు కలెక్టరేట్‌ను చుట్టుముట్టడంతో బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రెవెన్యూ సిబ్బంది ట్రాక్టర్‌పై బయటకు తీసుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details