OTR for TS Police jobs apply: రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులు దరఖాస్తుకు ముందే రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకమండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అమల్లోకి తెచ్చింది. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగాల్లో వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) మాదిరిగానే తొలుత టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసింది. ప్రాథమిక వివరాలతో మొదట రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తేనే దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. పోలీసు ఉద్యోగాలకు కిందటిసారి (2018) నియామకాల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి అంతకన్నా ఎక్కువగానే దరఖాస్తులొస్తాయని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా సర్వర్లలో లోపం తలెత్తకుండా ఉండేందుకు సాంకేతిక సిబ్బందిని సిద్ధం చేశారు. సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలుకాగా తొలిరోజే 15 వేల దరఖాస్తులు నమోదు కావడంతో పోటీ అధికంగా ఉంటుందని మండలి వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఓసీలే
తెలంగాణ పోలీసు నియామకాల్లో పోటీపడే బయటి రాష్ట్రాల అభ్యర్థుల విషయంలో వర్తించే నిబంధనలను నియామక మండలి వెల్లడించింది. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఏ సామాజికవర్గానికి చెందినా వారిని ఓసీలుగానే పరిగణించనున్నట్లు పేర్కొంది. కొత్త ప్రెసిడెన్షియల్ నిబంధనల ప్రకారం ఉద్యోగ నియామకాల్లో అయిదు శాతం మాత్రమే నాన్‌లోకల్ కేటగిరీగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ అయిదు శాతం కోటాలోనే పోటీ పడాల్సి ఉంటుంది.
ఎన్ని పోస్టులకైనా ఒకే ఫోన్ నంబర్
ఒకే అభ్యర్థి ఎస్సైతో పాటు కానిస్టేబుళ్ల కేటగిరీలో సివిల్, ఏఆర్.. తదితర విభాగాలకు పోటీపడే అవకాశముంది. ఇలా ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేసినా, అన్నింటిలోనూ ఒకే ఫోన్ నంబరు, ఒకే మెయిల్‌ఐడీని పేర్కొనాలని మండలి స్పష్టం చేసింది. ఆ ఫోన్ నంబరు, మెయిల్ ఐడీ నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉండాలని తెలిపింది. నియామకాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని వీటికే పంపించనున్నారు.