అల్పపీడనంతో పాటు దానికి అనుబంధంగా ఉపరితల అవర్తనం కూడా కొనగుతుండడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని జంట జలాశయాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1784.90 అడుగులకు నీరు చేరుకుంది. ఇన్ ఫ్లో 400 క్యూసెక్కులు కాగా.. ఔట్ ప్లో 200 క్యూసెక్కుల నీరు వదిలిపెడుతున్నామని... ఇప్పటి వరకు రెండు గేట్లను ఎత్తినట్లు అధికారులు తెలిపారు. హిమాయత్ సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1762.60 అడుగుల వరకు చేరుకుంది. ఇన్ ప్లో 600 క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్ ఫ్లో 1716 క్యూసెక్కులు వదిలిపెడుతున్నామని ఇప్పటి వరకు 5 గేట్లను ఎత్తామని అధికారులు తెలిపారు.
Hyd Floods: నిండుకుండల్లా జంట జలాశయాలు.. మూసీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తం - hyderabad projects
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జంట జలాశయాలు నిండుకుండలా మారిపోయాయి. క్రమంగా పూర్తిస్థాయి నీటి మట్టానికి నీరు చేరుకుంటున్నాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గేట్లను ఎత్తి నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేయడంతో పాటు.. పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడం వల్ల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలశయాలకు సంబంధించిన ఏడు గేట్లు ఎత్తివేశామని అధికారులు వెల్లడించారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే.. మలక్‌పేట ఏరియాలో డబీర్‌పురా, అజంపూర, ఓల్డ్ మలక్‌పేట, ముసారంబాగ్ ప్రాంతాలు, శంకర్‌నగర్, అజయ్ హట్స్ కాలనీల్లో చివర ఇళ్లు ఉన్నవారు ఖాళీ చేయాలని కార్పొరేటర్లు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని స్థానిక కమ్యూనిటీ హాళ్లు, మసీదులు, రసూల్‌పురాలో ఉన్న పాఠశాలలకు తరలించారు. పరిస్థితి సద్దుమనిగిన తర్వాత తిరిగి వారి ప్రాంతాలకు తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు. స్థానిక అధికారులు, కార్పొరేటర్ల సహాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు. పోలీసులు ఎప్పటికప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నారు.