సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో యూజీలోని అన్ని కోర్సులలో చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 15 నుంచి దశల వారీగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కోర్సుల వారీగా పరీక్షల షెడ్యూల్‌ను ఓయూ పరీక్షల విభాగం నియంత్రణాధికారి ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ విడుదల చేశారు. పరీక్షలను కొవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వర్సిటీ పరిధిలో చివరి ఏడాదిలో 1.10 లక్షల మంది విద్యార్థులుండగా.. 65 వేల మంది డిగ్రీ కోర్సుల వారు కాగా.. 20 వేల మంది సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు చదువుతున్నారు. మరో 25వేల మంది పీజీ కోర్సులు చేస్తున్నారు.
పీజీ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఉస్మానియా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎమ్మెస్‌డబ్ల్యూ పరీక్షలకు ఈ నెల 14వరకు ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ తెలిపింది. ఆలస్య రుసుముతో ఈ నెల 19 వరకు చెల్లించవచ్చునని పేర్కొంది.