కొవిడ్ మహమ్మారి అనేక మందికి తీరని శోకం మిగిల్చింది. అయినవారిని దూరం చేసి.. కుటుంబాల్లో అల్లకల్లోలం సృష్టించింది. కుటుంబ యజమానులను కాటేయడమే కాదు.. ఇంటికి వెలుగులైన ఇల్లాళ్ల ప్రాణాలూ బలితీసుకుంది. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన అనేక మంది పిల్లలు అనాథలుగా మిగిలారు. ఇలాంటి వారిని ‘పీఎంకేర్స్’ పథకం కింద ఆదుకుంటామని కేంద్రం చెప్పినా.. సాయం అందడంలో అవాంతరాలు తొలగడం లేదు. క్షేత్రస్థాయి ధ్రువీకరణ, విచారణ, ఇతర సాంకేతిక కారణాలతో దరఖాస్తులకు ఆమోదం లభించక ఎదురుచూపులు తప్పడం లేదు. కేంద్ర పథకం కన్నా.. మెరుగైన సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అనాథ పిల్లల సంరక్షణ కోసం ఏకీకృత విధానం ప్రకటిస్తామన్న హామీ నేటికీ నెరవేరలేదు.
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎంకేర్స్’ పథకాన్ని ప్రారంభించింది. తల్లిదండ్రులు ఇద్దరూ, సింగిల్ పేరెంట్, సంరక్షకులు చనిపోయిన 18 ఏళ్లలోపు పిల్లల ఉన్నత చదువులకు సాయం, సంరక్షణ, ఉపకార వేతనంతో పాటు 23 ఏళ్ల వయసు వచ్చేనాటికి రూ.10 లక్షలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రాల స్థాయిలో అర్హుల ఎంపిక, పిల్లల సంరక్షణ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు. దరఖాస్తుతో పాటు తల్లిదండ్రులు కరోనాతో చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని నిబంధన పెట్టారు. దేశవ్యాప్తంగా 6,624 దరఖాస్తులు రాగా.. 3,855 దరఖాస్తులను మాత్రమే కేంద్రం ఆమోదించింది. రాష్ట్రంలో 341 మంది దరఖాస్తు చేయగా.. 254 అర్జీలు మాత్రమే ఆమోదం పొందాయి. వివిధ కారణాలతో 87 దరఖాస్తులను తిరస్కరించారు. దరఖాస్తుదారుల తల్లిదండ్రులు/సంరక్షకులు కరోనాతో చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం లేదని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలితే ఆమోదం తెలపడం లేదు.
‘‘రాష్ట్రంలో తొలి విడతలో 292 దరఖాస్తులకు గానూ 237 ఆమోదం పొందాయి. రెండో విడతతో కలిపి మొత్తం 341లో 254 దరఖాస్తుదారులకు సాయం మంజూరైంది’’ అని మహిళా శిశు సంక్షేమ వర్గాలు వెల్లడించాయి. సరైన పత్రాలు లేకపోవడం, ఒకే లబ్ధిదారు పేరిట రెండేసి దరఖాస్తులతో డూప్లికేషన్, క్షేత్రస్థాయి విచారణలో అనర్హులుగా గుర్తించడంతో అందరికీ సహాయం అందలేదని పేర్కొన్నాయి. ప్రస్తుతం 254 మందికి ఆర్థిక సాయం మంజూరైందని.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి నెలకు రూ.2 వేల ఉపకార వేతనం లభిస్తోందని.. ప్రభుత్వ ఆశ్రమాలు, విద్యాలయాల్లో చదువుతున్నవారికి ఉపకార వేతనం ఇవ్వడం లేదని తెలిపాయి.