Aamgo Mangoes in America: జయప్రకాశ్ గోల.. అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టెక్నాలజీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 22 ఏళ్ల కిందట మాస్టర్స్ చదువుకోవడానికి వెళ్లి అక్కడే స్థిరపడ్డ జయప్రకాశ్ స్వస్థలం.. సంగారెడ్డి జిల్లా కోడూరు. ప్రవాస భారతీయుల ప్రోత్సాహంతో పార్ట్‌టైం వ్యాపారంలోకి దిగారు. 2016 నుంచి యూఎస్డీఏ లైసెన్స్ తీసుకుని భారత్ నుంచి దిగుమతి చేసుకున్న మామిడిపండ్లు అమెరికాలో ఆసక్తిగల వినియోగదారులకు విక్రయిస్తున్నారు. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా సామాజిక మాధ్యమ వేదికలుగా వచ్చిన ఆర్డర్లపై వినియోగదారుల ఇంటికే రుచికరమైన మధుర ఫలాలు అందిస్తూ ఆదరణ పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు పండించిన మామిడి పండ్లంటే ప్రవాస భాయతీయులే కాకుండా శ్వేత జాతీయులూ అమితంగా ఇష్టపడతారు. అట్లాంటా, షికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో, డెన్వర్, సేయింట్ లూయిస్ తదితర నగరాల్లో గిరాకీ ఉండటంతో క్రమంగా ఏయేటికాయేడు వ్యాపారం వృద్ధి చెందుతోంది. 5 వేల మంది వినియోగదారులను సంపాదించుకోగలిగారు. 2019లో ఏకంగా 5 కోట్ల రూపాయల వ్యాపారం చేశారు.
'అమెరికా వ్యాప్తంగా నాకు ఇప్పటి వరకూ 5,000 వరకు వినియోగదారులు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల మామిడి పండ్లంటే ఇష్టపడని వారుండరు. తాజా మామిడిపండ్లను ఆర్డర్లపై అందించి.. ఆ రుచిని అందరికీ పరిచయం చేయడమే నా లక్ష్యం. ప్రెసిడెంట్ బైడెన్‌కు ఓ కస్టమ్ బాక్స్ 12 మామిడి పండ్లు చేయమని చెప్పారు. అందుకోసం ప్రయత్నిస్తున్నాం. వినియోగదారులను రూ. 10 వేలకు పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.' -జయప్రకాశ్ గోల, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి