తెలంగాణ

telangana

ETV Bharat / city

మరుగుదొడ్ల పర్యవేక్షణ బాధ్యత వార్డు ఉద్యోగులకు అప్పగింతపై దుమారం - guntur corporation latest news

మరుగుదొడ్ల పర్యవేక్షణ బాధ్యతలు వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగిస్తూ... గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు జారీ చేసిన ఆదేశాలు దుమారం రేపాయి. నగర పరిధిలోని 5 ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్వహణ కాంట్రాక్టు ఫిబ్రవరి నెలతో ముగిసింది. ఇకమీదట ఈ బాధ్యతను ఆయా ప్రాంతాల్లోని వార్డు కార్యదర్శులు, అడ్మిన్లకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల్ని ఇలా మరుగుదొడ్ల విధులకు వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

guntur corporation
guntur corporation

By

Published : Mar 1, 2022, 5:22 PM IST

మరుగుదొడ్ల పర్యవేక్షణ బాధ్యతలు వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగిస్తూ.. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. నగర పరిధిలోని 5 ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్వహణ కాంట్రాక్టు ఫిబ్రవరి నెలతో ముగిసింది. దీంతో ఈ బాధ్యతను ఆయా ప్రాంతాల్లోని వార్డు కార్యదర్శులు, అడ్మిన్లకు అప్పగిస్తూ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నిరంజన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరుగుదొడ్ల వద్ద ఆదాయం లెక్కలు చూసేందుకు మూడు షిఫ్టుల్లో డ్యూటీలు వేసుకోవాలని ఆదేశించారు. గాంధీ పార్కు, బండ్ల బజారు, కృష్ణా పిక్చర్ ప్యాలెస్, ఎన్టీఆర్ బస్టాండ్, కొల్లి శారద కూరగాయల మార్కెట్ల వద్ద మరుగుదొడ్ల పర్యవేక్షణ చూడాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

రోజువారీ లక్ష్యాలు

మరుగుదొడ్ల వారీగా రోజువారీ లక్ష్యాల్ని నిర్దేశించారు. గాంధీ పార్కు వద్ద మరుగుదొడ్లకు రోజుకు రూ.5వేల లక్ష్యాన్ని నిర్దేశించారు. అదనపు కమిషనర్ జారీ చేసిన సర్కులర్‌లో వార్డు సచివాలయ కార్యదర్శులు, అడ్మిన్లు మరుగుదొడ్ల వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయాలని అర్థం వచ్చేలా ఉండటంపై కలకలం రేగింది. దీనిపై అదనపు కమిషనర్ నిరంజన్‌రెడ్డిని వివరణ కోరగా.. పర్యవేక్షణ బాధ్యతలను మాత్రమే ఉద్యోగులు చూస్తారని స్పష్టం చేశారు. ప్రతి మరుగుదొడ్డి వద్ద ఇద్దరు శానిటరీ వర్కర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. డబ్బుల వసూలు, పరిశుభ్రం చేసే బాధ్యత శానిటరీ వర్కర్లదేనన్నారు. సంబంధిత కార్యదర్శులు వారి నుంచి డబ్బులు తీసుకుని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు అందజేయాల్సి ఉంటుందన్నారు.

బిల్ కలెక్టర్ల వ్యవస్థ లేకపోవటంతో..

గతంలో మరుగుదొడ్ల నిర్వహణకు గుత్తేదారులదని.. వారి నుంచి డబ్బులు వసూలు చేసే బాధ్యత బిల్ కలెక్టర్లు చూసుకునేవారని తెలిపారు. ఇప్పుడు బిల్ కలెక్టర్ల వ్యవస్థ లేకపోవటంతో ఆయా ప్రాంతాల వార్డు కార్యదర్శులు, అడ్మిన్లు ఈ లెక్కలు చూడాలని ఆదేశించినట్లు చెప్పారు. దీనిపై స్పష్టంగా మరోసారి ఆదేశాలు వస్తాయన్నారు. అయితే అదనపు కమిషనర్ జారీ చేసిన ఆదేశాలపై వార్డు సచివాలయ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్యోగుల్ని ఇలా మరుగుదొడ్ల విధులకు వేయడమేంటని ప్రశ్నించింది.

ఇదీ చదవండి:జోరుగా​ చలాన్ల చెల్లింపులు.. దెబ్బకు సర్వర్లు హ్యాంగ్​..!

ABOUT THE AUTHOR

...view details