తెలంగాణ

telangana

ETV Bharat / city

నాని వ్యాఖ్యలపై దుమారం.. బర్తరఫ్​ చేయాలని విపక్షాల డిమాండ్ - కొడాని నానిపై బీజేపీ కామెంట్స్

హిందూ దేవుళ్లు, మనోభావాలపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపాయి. మంత్రి తీరును ఖండిస్తూ భాజపా, తెదేపా, హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

kodali nani
kodali nani

By

Published : Sep 21, 2020, 10:45 PM IST

ఏపీ మంత్రి నాని వ్యాఖ్యలపై దుమారం.. బర్తరఫ్​ చేయాలని విపక్షాలు డిమాండ్

హిందూ దేవుళ్లపై ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మంత్రిపై విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్​లో ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. హిందువులను రెచ్చగొట్టేలా మంత్రి మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాచవరం దాస ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన సోము వీర్రాజు... కొడాలి నానిని శిక్షించాలని ప్రార్థించారు. దేవాలయాలపై మంత్రి కొడాలి వ్యాఖ్యలను ఖండించారు. నాయకులు ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు. మాట్లాడే భాష ద్వారా ప్రజలకు ఏం సందేశమిస్తున్నామో గుర్తుంచుకోవాలన్నారు. ఏ సీఎం అయినా తమ సభ్యులు సరిగా మాట్లాడేలా చూడాలని హితవు పలికారు. నాయకులు వినియోగించే భాష పట్ల చట్టబద్ధత ఉండాలని చెప్పారు. మంత్రి కొడాలి నాని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలను ఖండిస్తూ భాజపా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మంత్రిపై పలు జిల్లాల్లో భాజపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీఎం మౌనం వీడాలి

సీఎం జగన్ మౌనంగా ఉంటూ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను సమర్థిస్తున్నారని ఏపీ భాజపా సహ ఇన్​ఛార్జ్ సునీల్ దేవ్​ధర్ వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై తిరుపతిలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని తిరుమల-తిరుపతి సంరక్షణ సమితి... భాజపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కొడాలి వ్యాఖ్యలపై భాజపా నేతలు తిరుపతి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మతసామరస్యాన్ని నాశనం చేయొద్దు

తిరుమలలో అనాదిగా వస్తున్న నిబంధనలను మార్చే హక్కు జగన్‌కు ఎవరిచ్చారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. పద్మనాభస్వామి ఆలయంలోకి చొక్కా ధరించి వెళ్లగలరా అని నిలదీశారు. ఇప్పటివరకూ అన్ని మతాలవారు కలిసిమెలసి ఉన్నారని అలాంటి మతసామరస్యాన్ని నాశనం చేయొద్దని హెచ్చరించారు.

మంత్రి క్షమాపణ చెప్పాలి

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి కొడాలి నాని మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ దేవాలయాలపై, తితిదే అంశాలపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వెంటనే హిందూ సమాజానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవుళ్లపై దాడులు పెరిగాయని తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ధ్వజమెత్తారు.

హిందూ దేవుళ్లపై జరుగుతున్న దాడులపై ముఖ్యమంత్రి నోరు విప్పాలని పలువురు హితవు పలుకుతున్నారు. హిందూ దేవుళ్లపై జరుగుతున్న దాడుల్లో ప్రభుత్వం హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి :నోరు మెదపలే: ఆ నలభై లక్షలు ఎక్కడ దాచినట్టు?

ABOUT THE AUTHOR

...view details