తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి నుంచే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. 15న స్వామివారి కల్యాణం

Ontimitta Brahmotsavalu: ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్టలో కోదండరాముడి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈనెల 19 వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగనున్నాయి. ఈనెల 15న ఆరుబయట సీతారాముల కల్యాణాన్ని లక్ష మంది వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్… స్వామివారి కల్యాణం రోజున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Ontimitta Brahmotsavalu
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

By

Published : Apr 9, 2022, 8:57 AM IST

Ontimitta Brahmotsavalu: ఆంధ్రప్రదేశ్​లోని వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలో శ్రీకోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. వరుసగా రెండేళ్ల పాటు కరోనా కారణంగా ఏకాంతంగానే స్వామివారి ఉత్సవాలు నిర్వహించిన తితిదే.. ఈసారి అత్యంత వైభవంగా చేయాలని నిర్ణయించింది. శనివారం రాత్రి అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమై.. ఈనెల19న పుష్పయాగంతో ముగుస్తాయి. 10వ తేదీన ధ్వజారోహణను ఘనంగా నిర్వహించనున్నారు. తిరుపతికి చెందిన ఆగమశాస్త్ర పండితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. 15న సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

11వ శతాబ్దంలో నిర్మించిన ఏకశిలానగరి ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల మూలవిరాట్టులు మాత్రమే గర్భగుడిలో దర్శనమిస్తాయి. త్రేతాయుగంలో రామలక్ష్మణులు వనవాసం సందర్భంగా ఒంటిమిట్ట ప్రాంతానికి వచ్చినపుడు... రుషుల యజ్ఞాలకు రాక్షసులు భంగం కల్గించేవారు. రాక్షసులను సంహరించి రుషుల యజ్ఞాన్ని జయప్రదం చేసిన రామలక్ష్మణులు కోదండరాముడి అవతారంలో కనిపిస్తారని ప్రతీతి. ఆంజనేయస్వామి శ్రీరాముడికి పరిచయం కాకముందే ఈ ఆలయంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశిలపై నిర్మించారనేది చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఎక్కడా కనిపించదు.

రాష్ట్ర విభజన తర్వాత 2015లో ప్రభుత్వ లాంఛనాలతో ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పుడే దేవాదాయశాఖ బహిరంగ ప్రదేశంలో సీతారాముల కల్యాణం నిర్వహించగా... 2016 నుంచి ఆ బాధ్యతను తితిదేకి అప్పగించారు. పురాణాల ప్రకారం చంద్రుడు చూసేలా ఒంటిమిట్టలో శ్రీరాముడు కల్యాణం చేసుకుంటాడని... అందులో భాగంగానే రాత్రి సమయంలో అక్కడ కల్యాణం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదీ బహిరంగ ప్రదేశంలో స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమేరకు 52 ఎకరాల విస్తీర్ణంలో ... 52 వేల మంది కూర్చొని ప్రత్యక్షంగా స్వామివారి కల్యాణ ఘట్టాలను తిలకించేలా వేదికను తితిదే సిద్ధం చేసింది. శాశ్వత కల్యాణ వేదిక నిర్మించిన తర్వాత జరుగుతున్న తొలి కల్యాణ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 15న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారి కల్యాణం జరగనుంది. ఉత్సవాలకు రూ. 2 కోట్లను తితిదే వెచ్చిస్తోంది.- సుమతి, తి.తి.దే. ఈఈ

ఒంటిమిట్ట వేడుకలకు ప్రముఖులు హాజరవుతున్నందున పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం ముందు నుంచే డాగ్ స్కాడ్​తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ అన్బురాజన్ ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:Bhadradri Temple: సీతారాముల కల్యాణానికి సిద్ధమైన భద్రాద్రి దివ్యక్షేత్రం

ABOUT THE AUTHOR

...view details