Salaries Bills in Andhra pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2022 పీఆర్సీ ప్రకారం ఫిబ్రవరి జీతాలు సకాలంలో ఇవ్వాలంటే ఇప్పుడు డ్రాయింగ్ డిస్‌బర్సుమెంటు అధికారులకు, ఖజానా అధికారులకు పెద్ద పనే పడింది. 5రోజుల్లోనే రెండు నెలల బిల్లుల ప్రక్రియ పూర్తి చేయాలి. మొత్తం 4,96,875 మంది ఉద్యోగుల జనవరి జీతాలు 010 పద్దు కింద చెల్లించినట్లు డ్రాయింగ్ డిస్‌బర్సుమెంట్ అధికారులు ప్రక్రియను పూర్తి చేయాలి. తర్వాత కొత్త వేతన సవరణ ప్రకారం స్కేళ్లు తయారుచేసి అదనంగా చేర్చాల్సినవి, వారి జీతం నుంచి మినహాయించినవి తేల్చి, వాటిని ఖజానా అధికారులకు సమర్పించాలి. ఈ మొత్తం పని ఫిబ్రవరి 25లోపు.. అంటే 5రోజుల్లో పూర్తి చేయాలని ఆర్థికశాఖ అధికారులు ఉత్తర్వులిచ్చారు. సాధారణంగా జీతాల బిల్లులు నిర్దిష్ట గడువులోపు సమర్పించకపోతే అనుబంధ జీతాల బిల్లులు ప్రతి నెలా 5 తర్వాత సమర్పించేందుకు ఆస్కారం ఉంటుంది. ఫిబ్రవరి జీతాలకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. మొత్తం జీతాల ప్రక్రియ రెండు నెలల పని రాబోయే 5 రోజుల్లో పూర్తిచేసి సమర్పించకపోతే ఫిబ్రవరి జీతాలు సకాలంలో అందుకోవడం కష్టమే అవుతుంది.
ఏపీ ప్రభుత్వం కొత్త పీఆర్సీని 2022 జనవరి నుంచి అమలు చేసింది. అప్పట్లో ఉద్యోగులు, డీడీవోల సహాయనిరాకరణ వల్ల కొత్త పీఆర్సీ జీతాల బిల్లులు సమర్పించలేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా జనవరి జీతాలు కొత్త వేతన సవరణ ప్రకారమే ఇవ్వాలనే పట్టుదలతో వ్యవహరించింది. దీంతో 24,496 మంది డీడీవోలు చేయాల్సిన పనిని ఒక ఖజానాశాఖ డైరక్టర్ చేసేలా ఆదేశాలిచ్చి జీతాల పద్దు నుంచి కాకుండా సస్పెన్స్ ఖాతా ద్వారా జనవరి జీతాలు చెల్లించింది. దీంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలోని డీడీవోలు వాస్తవంగా ఏ ఉద్యోగికి జనవరి జీతం ఎంత ఇవ్వాలో లెక్కకట్టాలి.
- సస్పెన్సు ఖాతాకు డీడీవోలంతా జీతం హెడ్‌లను డెబిట్ చేసేలా సర్దుబాటు చేయాలి.
- ప్రతి డీడీవో నుంచి సస్పెన్సు ఖాతా నుంచి డ్రా చేసిన మొత్తానికి సమానమైన మొత్తం బిల్లు జనరేట్ చేసి సంబంధిత సర్దుబాటు బిల్లు ట్రెజరీకి పంపితే అక్కడ సస్పెన్స్ ఖాతా సర్దుబాటు బిల్లులను ఆమోదిస్తారు.
- దీంతోపాటు ఫిబ్రవరి జీతాల బిల్లులు తయారుచేసి ఖజానాలకు సమర్పించాలి.
- ఉద్యోగుల వేతన స్థిరీకరణ కార్యక్రమం ఇంకా డీడీవోలు, ఖజానా అధికారులు, పే అండ్ అకౌంట్సు అధికారుల వద్ద డేటా ఎంట్రీ నమోదు, నిర్ధారణ ప్రక్రియ పూర్తిచేయలేదు. ఇదంతా ఎప్పటికి పూర్తవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.