కరోనా వైరస్ బాధితుల్లో తీవ్రమైన లక్షణాలున్న వారిని మాత్రమే గాంధీ ఆసుపత్రిలో ఉంచాలని, మిగతా వారిని ఇళ్లలో, లేదా ప్రభుత్వాసుపత్రుల్లో ఐసోలేషన్‌లో ఉంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. జిల్లాల్లో అయితే ఆయా జిల్లా ఆసుపత్రుల్లో, హైదరాబాద్‌లో అయితే ఆయుర్వేద వైద్యకళాశాలలో ఉంచాలని సూచించారు.
తీవ్ర లక్షణాలు, అత్యవసర పరిస్థితి వారికే గాంధీలో చికిత్సలు
కరోనా వైరస్ బాధితుల్లో తీవ్రమైన లక్షణాలున్నవారికి, అత్యవసర చికిత్స అవసరం అయినవారికి మాత్రమే గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. లక్షణాలు కనిపించకుండా పాజిటివ్ వచ్చినవారిని వారి ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు. ఒకవేళ ఆ సదుపాయం లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ సన్నద్ధతపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ యోగితారాణా, కరోనా నోడల్ అధికారులు రఘునందన్, మాణిక్‌రాజ్, ప్రీతిమీనా, క్రిస్టినా, వైద్యవిద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటినీ సందర్శిస్తూ జ్వరపరీక్షలు నిర్వహించాలనీ, లక్షణాలున్నవారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపాలన్నారు. అక్కడ కూడా అనుమానమొస్తే జిల్లా ఆసుపత్రులలో కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. అన్ని స్థాయుల ఆసుపత్రుల్లోనూ జ్వర క్లినిక్‌లను విడిగా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కరోనా లక్షణాలున్నవారి కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లోనే ఐసోలేషన్ వార్డులను నెలకొల్పాలన్నారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, ఆక్సిజన్ పైపులైన్లను ఏర్పాటుచేయాలని ఈటల తెలిపారు.