ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఫైనాన్స్ యాప్ నిర్వాహకుల వేధింపులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కరోనా లాక్‌డౌన్‌తో ఆదాయాలు తగ్గిన నేపథ్యంలో వ్యాపారం, ఇంటి అవసరాల నిమిత్తం కొంతమంది మైక్రో ఫైనాన్స్‌ను ఆశ్రయించారు. యాప్ ద్వారా సులువుగానే వస్తుండటంతో రుణాలు తీసుకున్నారు. అయితే అప్పు వసూలులో నిర్వాహకులు వ్యవహరించే తీరు తెలియక మోసపోయారు. అప్పు చెల్లించటంలో కొంచెం ఆలస్యమైనప్పటికీ ముక్కుపిండి వసూలు చేసేలా నిర్వాహకులు వ్యవహరిస్తున్నతీరు ఆందోళన కలిగిస్తోందని బాధితులు వాపోతున్నారు. గడువు ఇవ్వాలని అడిగినా ఆగకుండా పదేపదే ఫోన్ చేసి వేధిస్తున్నారని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే తమ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ తాము మోసగాళ్లమనే అర్థం వచ్చేలా సందేశాలు పంపుతున్నారని ఆందోళన చెందుతున్నారు.
గుంటూరులో కొత్తపేటకు చెందిన దుర్గ... మైక్రో ఫైనాన్స్ నిర్వాహకుల నుంచి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. మనీహియర్, స్టార్ క్రెడిట్ అనే యాప్‌ల ద్వారా రూ.70 వేల వరకు రుణం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈఎంఐలు అన్నీ వడ్డీతో సహా చెల్లించింది. గతవారం ఈఎంఐ ఆలస్యం కావటంతో వెంటనే డబ్బు కట్టాలని వేధిస్తున్నారని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేసింది. డబ్బు కట్టకపోతే ఫోన్‌లో కాల్‌డేటా తీసుకుని నెంబర్లకు మెసేజ్‌లు పెడతామని, వ్యక్తిగత సమాచారాన్ని బయటపెడతామని బెదిరించినట్టు ఆరోపించింది. వేధింపులు తాళలేక ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని.. యాప్ నిర్వాహకుల నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను వేడుకుంది.