రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులపై విద్యాశాఖ విధివిధానాలు ప్రకటించింది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి రూపొందించిన ప్రజ్ఞత మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్ పాఠాలు బోధించాలని స్పష్టం చేసింది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు రోజుకు గరిష్టంగా 45 నిమిషాల పాటు.. వారంలో మూడు రోజులు మాత్రమే ఆన్‌లైన్ పాఠాలను బోధించాలని పేర్కొంది. ఒకటి నుంచి 12వ తరగతి వరకు వారంలో ఐదు రోజులు మాత్రమే ఆన్‌లైన్ పాఠాలు ఉండాలని స్పష్టం చేసింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 45 నిమిషాలకు మించకుండా... రోజుకు రెండు తరగతులు మాత్రమే నిర్వహించాలని తెలిపింది. ఆరు నుంచి 8వ తరగతి వరకు... రోజుకు మూడు తరగతులు.. 9 నుంచి 12 వరకు రోజుకు నాలుగు తరగతులు మాత్రమే బోధించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన పేర్కొన్నారు.
ఎస్‌సీఈఆర్‌టీ వర్క్‌షీట్లు
ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబరు 1 నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించిన విద్యాశాఖ.. ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈనెల 27 నుంచి ఉపాధ్యాయలు అందరూ హాజరు కావాలని విద్యా శాఖ పేర్కొంది. టీవీలు లేని విద్యార్థుల కోసం పంచాయతీ లేదా ఇతర విద్యార్థుల సహకారం తీసుకోవాలని తెలిపింది. పాఠ్యపుస్తకాలతోపాటు ఎస్‌సీఈఆర్‌టీ ప్రత్యేకంగా రూపొందించిన వర్క్ షీట్లు విద్యార్థులకు చేరేలా ఉపాధ్యాయలు చర్యలు తీసుకోవాలని తెలిపింది.