తెలంగాణ

telangana

ETV Bharat / city

ONLINE CLASSES: జులై 1 నుంచి ఆన్​లైన్​ తరగతులు: మంత్రి సబిత - online classes in telangana

విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనను ప్రభుత్వం వాయిదా వేసింది. కేజీ నుంచి పీజీ వరకు అన్ని తరగతులకు కొన్నాళ్ల పాటు ఆన్​లైన్ పాఠాలే చెప్పనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జులై 1 నుంచి కేజీ నుంచి రెండో తరగతి విద్యార్థులు మినహా మిగిలిన వారికి ఆన్​లైన్ భోదన ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆగస్టు 1 నుంచి మిగిలిన వారికీ ఆన్​లైన్​ క్లాసులు ప్రారంభిస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం కూడా జీవో 46 ప్రకారం కేవలం బోధన రుసుములు.. మాత్రమే అది కూడా నెలవారీగా తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రకటించిన ప్రవేశ పరీక్షలతో పాటు.. వచ్చే నెలలో జరగాల్సిన డిగ్రీ, పీజీ, డిప్లొమా పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు.

sabitha Indra reddy
జులై 1 నుంచి ఆన్​లైన్​ తరగతులు: మంత్రి సబిత

By

Published : Jun 28, 2021, 5:58 PM IST

Updated : Jun 28, 2021, 9:34 PM IST

జులై 1 నుంచి ఆన్​లైన్​ తరగతులు: మంత్రి సబిత

జులై 1 నుంచి అన్ని విద్యాసంస్థలు ప్రారంభించనున్నట్లు గతంలో ప్రకటించిన ప్రభుత్వం... కరోనా తీవ్రత, హైకోర్టు ప్రశ్నలతో వెనక్కి తగ్గింది. కొన్నాళ్ల పాటు ఆన్​లైన్ బోధనే కొనసాగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​రావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఇవాళ ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ సహా కేజీ నుంచి పీజీ వరకు అన్ని తరగతులు ఆన్​లైన్ పాఠాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. జులై 1 నుంచి మూడో తరగతి నుంచి పీజీ వరకు ఆన్​లైన్ బోధన మొదలు పెట్టనున్నట్లు వెల్లడించారు. కేజీ నుంచి రెండో తరగతి వరకు ఆగస్టు 1 నుంచి ఆన్​లైన్​ బోధన ప్రారంభిస్తామన్నారు.

వారికి ఆఫ్​లైన్​ పరీక్షలే...

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు గతేడాది మాదిరిగానే దూరదర్శన్ యాదగిరి, టీ శాట్ ఛానళ్ల ద్వారా పాఠాలు ప్రసారమవుతాయన్నారు. దూరదర్శన్ యాదగిరి, టీశాట్ యాప్, ఎన్​​సీఈఆర్​ట్​ వెబ్​సైట్​లోనూ అందుబాటులో ఉంటాయని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ ప్రకటించిన తేదీల్లోనే యథాతథంగా జరుగుతాయన్నారు. అందులో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. అదే విధంగా వచ్చే నెలలో జరగనున్న డిగ్రీ, పీజీ, డిప్లొమా పరీక్షలన్నీ ఆఫ్​లైన్​లోనే జరుగుతాయని మంత్రి వెల్లడించారు.

జీవో 46 ప్రకారమే ఫీజులు..

ప్రైవేట్ పాఠశాలలు ఈ విద్యాసంవత్సరంలోనూ జీవో 46 ప్రకారమే ఫీజులు వసూలుచేయాలని సబితా స్పష్టం చేశారు. కేవలం బోధన రుసుమును మాత్రమే అదీ నెలవారీగా తీసుకోవాలన్నారు. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వీలైతే ఫీజులను మరింత తగ్గించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు.. రోజుకు 50 శాతం మాత్రమే హాజరయ్యేలా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు చెప్పారు. సర్కారు బడుల విద్యార్థుల కోసం 90 శాతం పుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరాయన్నారు.

సబితా ఇంద్రారెడ్డి నిర్వహించిన సమావేశానికి విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, ఉపాధ్యక్షుడు లింబాద్రి, కళాశాల, సాంకేతిక విద్యా శాఖల కమిషనర్ నవీన్ మిత్తల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, ఇతర అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జులై 1 నుంచి ఆన్​లైన్​ తరగతులు ప్రారంభిస్తున్నాం. సెట్స్​ సంబంధించి ఎలాంటి మార్పులు లేవు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు జులైలోనే పరీక్షలు నిర్వహిస్తాం. తెలంగాణలో నిర్వహించిన ఆన్​లైన్​ తరగతులను కేంద్రం ప్రశంసించింది. దూరదర్శన్​ యాదగిరి, టీ శాట్​ ఛానళ్ల ద్వారా తరగతులు నిర్వహిస్తాం.

- సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి

ఇదీచూడండి:INTER RESULTS: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల

Last Updated : Jun 28, 2021, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details