తెలంగాణ

telangana

ETV Bharat / city

Online Bonam : ఉజ్జయిని అమ్మవారికి ఆన్‌లైన్‌లో బోనం

Online Bonam :ఆషాఢమాసం వచ్చేస్తోంది.. బోనాల పండుగను తన వెంట తెచ్చేస్తోంది. ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరుపుకునే బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. అయితే ఈ పండుగకు నగర ప్రజలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి చాలా మంది భక్తులు వస్తుంటారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న వారు కూడా బోనాల పండుగకు రావాలనుకుంటారు. కానీ వీలుకాకపోవడంతో నిరాశ చెందుతుంటారు. ఉన్న చోటే అమ్మవారికి మనసులో మొక్కుకుంటారు. అయితే భక్తులు భాగ్యనగరానికి వచ్చి బోనాల పండుగలో పాల్గొనకపోయినా.. తమ పేరిట అమ్మకు బోనం సమర్పించేందుకు వీలుగా తెలంగాణ సర్కార్ ఓ చక్కటి అవకాశం కల్పిస్తోంది. అదే ఆన్‌లైన్ బోనం. మరి దీని సంగతేంటో తెలుసుకోండి..

Online Bonam
Online Bonam

By

Published : Jun 17, 2022, 9:24 AM IST

Online Bonam :ప్రతిఏటా కన్నులపండువగా జరుపుకునే బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. మరికొద్ది రోజుల్లో ఆషాఢమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర సర్కార్ సన్నద్ధమైంది. హైదరాబాద్‌లో జరిగే ఈ వేడుకకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.

Bonalu festival in Hyderabad : విదేశాల్లో ఉన్న వారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి అమ్మవారిని దర్శించుకోవడానికి కొన్నిసార్లు వీలుపడదు. వారు ఉన్న చోటే మనసులో అమ్మకు మొక్కుకుంటారు. కానీ బోనం సమర్పించలేరు. అలాంటి వారి కోసం రాష్ట్ర దేవాదాయశాఖ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే.. అమ్మవారికి ఆన్‌లైన్‌లో బోనం సమర్పించడం.

Bonalu festival in Hyderabad 2022 :హైదరాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళీ అమ్మ వారికి ఆన్‌లైన్‌ బోనాలు సమర్పించే సదుపాయానికి దేవాదాయశాఖ శ్రీకారం చుట్టింది. నేటి(ఈనెల 17 నుంచి) నుంచి బుకింగ్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇక్కడి అరణ్యభవన్‌లోని తన కార్యాలయంలో ఆయా సేవలను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో బోనం సమర్పించే సదుపాయాన్ని దేశ, విదేశాల్లోని వారెవరైనా వినియోగించుకోవచ్చని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

‘‘ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారి పేరిట ఆలయ నిర్వాహకులే అమ్మవారికి బోనం సమర్పిస్తారు. గోత్ర నామాలతో పూజలు నిర్వహించిన బియ్యం, బెల్లం, అమ్మవారి అక్షతలు, పసుపు, కుంకుమ పోస్టులో ఇంటికే పంపిస్తారు. టీయాప్‌ ఫోలియో, మీసేవా, ఆలయాల వెబ్‌సైట్‌, పోస్టాఫీసుల ద్వారా ఈ సేవలను పొందవచ్చు. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా రూ.300, విదేశాల్లోని భక్తులు రూ.1000 చెల్లించాలి. తపాలాశాఖ, ఆర్టీసీ కొరియర్ల ద్వారా ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేశాం." అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

ఆన్‌లైన్‌లో ఎల్లమ్మ కల్యాణం..హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ వారి కల్యాణ సేవలను కూడా ఆన్‌లైన్‌లో పొందవచ్చు. కల్యాణం జులై అయిదో తేదీన వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నాలుగో తేదీలోగా రూ.500 చెల్లించి సేవలను బుక్‌ చేసుకోవచ్చు’’ అని మంత్రి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details