తెలంగాణ

telangana

ETV Bharat / city

Konaseema Riots : అమలాపురంలో తాజా పరిస్థితి ఇదీ.. - Konaseema Riots news

Konaseema Riots : కోనసీమ జిల్లా అమలాపురంలో తాజా పరిస్థితిని.. పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ.. మే 24న సంఘటన అనంతరం మోహరించిన ప్రత్యేక బలగాలు, పోలీసు పికెట్లు ఇంకా కొనసాగుతున్నాయి. పలు మండలాల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. అల్లర్లలో పాల్గొన్న వారిలో ఇప్పటి వరకు 91 మందిని అరెస్టు చేశారు.

Konaseema Riots
Konaseema Riots

By

Published : Jun 4, 2022, 1:13 PM IST

Konaseema Riots : కోనసీమ జిల్లా అమలాపురంలో విధ్వంసంతో అప్రమత్తమైన పోలీసు శాఖ క్షేత్రస్థాయి పరిస్థితిపై నిశితంగా దృష్టిసారించింది. మే 24న సంఘటన అనంతరం క్షేత్రస్థాయి పరిస్థితి కుదుటపడినా ప్రత్యేక బలగాల మోహరింపు.. పోలీసు పికెట్లు కొనసాగుతున్నాయి. అమలాపురం పట్టణంలోని గడియార స్తంభంతోపాటు ప్రధాన మార్గాల్లో బందోబస్తు కొనసాగుతోంది. పేరూరు వై జంక్షన్‌, హైస్కూలు సెంటర్‌, ఈదరపల్లి, ఎర్ర, నల్ల వంతెన, బట్నవిల్లి ప్రాంతాల్లో పోలీసు పికెట్లు కొనసాగుతున్నాయి. అనుమానితులను తనిఖీచేసి.. వారి వివరాలు సేకరించాక పట్టణంలోకి అనుమతిస్తున్నారు.

పలు మండలాలకు అంతర్జాలం పునరుద్ధరణ:జిల్లాలో పది రోజులుగా నిలిచిన అంతర్జాల సేవలను విడతల వారీగా పునరుద్ధరిస్తున్నారు. ఎస్పీ సుబ్బారెడ్డి క్షేత్రస్థాయి పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చాక.. కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు నివేదిస్తున్నారు. దీంతో హోం శాఖ అనుమతితో అంతర్జాల సేవలు పునరుద్ధరిస్తున్నారు. పి.గన్నవరం, రాజోలు, ఐ.పోలవరం, సఖినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు, ఆత్రేయపురం మండలాల్లో అంతర్జాల సేవలు అందుబాటులోకి తెచ్చిన అధికారులు.. శుక్రవారం రాత్రి ఉప్పలగుప్తం, రావులపాలెం మండలాలకూ అంతర్జాల సేవలు అందించారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంతోపాటు.. అల్లవరం, కొత్తపేట, ముమ్మిడివరం, అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో సేవలపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

కదలికలపై నిఘా..:ఇప్పటికే అమలాపురం అల్లర్లలో పాల్గొన్న వారిని గుర్తించే ప్రక్రియను పోలీసులు పూర్తిచేశారు. ఇప్పటివరకు పలు విడతల్లో 91 మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరు రౌడీషీటర్లు, ఇతర అనుమానాస్పద వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. వదంతులు.. రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితిపై మరింత లోతుగా పోలీసులు దృష్టిసారించారు. అంతర్జాలం అందుబాటులోకి రావడంతో వీటిజోరు పెరిగే అవకాశం ఉన్నందున సాంకేతికతతో దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

శ్రుతిమించితే చర్యలు తప్పవు: "కోనసీమలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. పరిస్థితి చల్లారినా నిఘా, కీలక ప్రాంతాల్లో బందోబస్తు కొనసాగిస్తున్నాం. అంతర్జాల సేవలు పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో ఆయా మండలాల్లో పరిస్థితిపై పూర్తిస్థాయి నిఘా ఉంచాం. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వదంతులు సృష్టించినా... వాటిని వాట్సప్‌, ఇతర గ్రూపుల ద్వారా పంపినా కేసులు నమోదుచేస్తాం. ఇలాంటి వ్యవహారాల్లో యువత జోక్యం చేసుకుని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు." - సుబ్బారెడ్డి, ఎస్పీ

ఇదీ చదవండి :'స్పైడర్ మ్యాన్' సాహసాలతో వరుస చోరీలు.. అడ్డంగా కెమెరాకు చిక్కి..!

ABOUT THE AUTHOR

...view details