మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 67వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఏపీ కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో పులివెందులకు చెందిన సునీల్ బంధువు భరత్ యాదవ్, సుంకేశులకు చెందిన ఉమాశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరితో పాటు ఎర్రగంగిరెడ్డి విచారణకు హాజరయ్యారు. పులివెందులలో మరో సీబీఐ బృందం విచారణ జరుపుతోంది. సునీల్, దస్తగిరిని వివేకా ఇంటికి సీబీఐ అధికారులు తీసుకెళ్లి పరిశీలించారు. ఆ తర్వాత ఇద్దరిని పులివెందులలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ప్రశ్నిస్తున్నారు.
వీరితో పాటు వివేకా పీఏ కృష్ణారెడ్డి, ఈసీ గంగిరెడ్డి బంధువు సురేంద్రనాథ్ రెడ్డి, చెప్పుల దుకాణం యజమాని మున్నాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. సురేంద్రనాథ్ రెడ్డి వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ వర్శిటీ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. కడపకు చెందిన ముగ్గురు బ్యాంకు అధికారులు నిన్న విచారణకు హాజరయ్యారు. కర్ణాటకలో ల్యాండ్ సెటిల్మెంట్కు సంబంధించి వివేకా, సునీల్ మధ్య వివాదం ఉన్న నేపథ్యంలో అక్కడి బ్యాంక్ అధికారులు, రెవెన్యూ సిబ్బందిని సీబీఐ అధికారులు పిలవడం చర్చనీయాంశమైంది.