'న్యాయస్థానం నుంచి దేవస్థానం' వరకు పేరిట అమరావతి రైతులు తలపెట్టిన ర్యాలీకి అనుమతి నిరాకరించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు... రాజధాని ప్రాంతంలో తీవ్ర స్థాయిలో ఆంక్షలు పెట్టారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏపీ రాజధాని ప్రాంతంలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులను పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే కరకట్ట మార్గంలో 4 చోట్ల చెక్ పోస్టులను పెట్టి మీడియా ప్రతినిధులు రాజధానులోకి వెళ్లకుండా అడ్డగించారు. మీడియా ప్రతినిధులు ఫొటోలు, వీడియోలు తీయనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.
ముమ్మర తనిఖీలు
మీడియా ప్రతినిధుల ఫొటోలు తీసుకుని ,వాహనాల నంబర్లను పోలీసులు నమోదు చేసుకున్నారు. రాజధానిలోకి మీడియాను పంపించవద్దని తమకు ఆదేశాలు వచ్చాయని పోలీసులు తెలిపారు. విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా రాజధానికి వెళ్లే మార్గంలో అడుగడుగునా ఆంక్షలు విధించారు. ప్రకాశం బ్యారేజీ, సహా కరకట్ట వెంట భారీగా పోలీసులు మొహరించారు. కరకట్టపై నాలుగు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు.. స్థానికులను మాత్రమే కరకట్ట రహదారిపై అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటేనే రాకపోకలకు అనుమతుస్తున్నారు. వాహనాలను పూర్తిగా తనిఖీ చేశాకే అనుమతిస్తున్నారు. పోలీసు ఆంక్షలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
600 రోజుల ఉద్యమం
రాజధానిని అమరావతినే కొనసాగించాలని రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం 600 రోజులకు చేరింది. 2019 డిసెంబర్17ని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి నేటి వరకు అమరావతి ఉద్యమం కొనసాగుతోంది. 600ల రోజుకి చేరిన సందర్భంగా రైతులు మహిళలు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం ర్యాలీకి పోలీసులు అనుమతులు నిరాకరించారు.
ఎక్కడికక్కడ అడ్డగింత
మరోవైపు విజయవాడ- అమరావతి మార్గంలోనూ అడుగడుగునా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ సహా కరకట్ట వెంట పోలీసులు మోహరించారు. కరకట్టపై 4 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పలు చోట్ల నిరసనలకు దిగిన అమరావతి ఉద్యమకారులు, తెదేపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. తాడేపల్లిలో పలువురు తెదేపా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అమరావతి రైతులు ర్యాలీగా వస్తారన్న సమాచారంతో ఆలయం చుట్టు పక్కల ఇనుప కంచె వేసి సమీపంలోకి ఎవరినీ రానివ్వడం లేదు.