పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. కరీంనగర్‌లో ముస్లిం సంఘాలు, ట్రస్ట్‌లతోపాటు తెరాస, కాంగ్రెస్, తెదేపాల సంఘీభావంతో తెలంగాణచౌక్ నుంచి కలెక్టరేట్ వరకు మహార్యాలీ చేపట్టారు. కలెక్టరేట్‌లోకి కొంతమంది ముస్లింపెద్దలను ఆహ్వానించి సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
ఎన్‌ఆర్‌సీ, సీఏఏలతో దేశ ఐక్యతకు భంగం వాటిల్లే పరిస్థితి నెలకొందని సీపీఎం కేంద్ర కమిటీ పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అమలుచేయనున్న ఎన్‌ఆర్‌సీ, సీఏఏను ప్రజలు ప్రతిఘటించాలని కోరారు. హిందూసంస్కృతిని అనుకరించే వారు దేశ పౌరులంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ చెప్పడం మతోన్మాదచర్య అని పేర్కొన్నారు.
నిజామాబాద్‌లో బహిరంగ సభ
ఎన్‌ఆర్సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఉర్దూ అకాడమీ ఛైర్మన్ రహీముద్దీన్ అన్సారీ తెలిపారు. ఈ సభకు తెరాస ప్రతినిధిగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు తెరాస అధిష్ఠానం మజ్లిస్ నేతలకు సమాచారం అందించింది.
అమలు చేయవద్దు
మతోన్మాదానికి వ్యతిరేకంగా గాంధీ వర్ధంతి రోజున భాజపాయేతర పార్టీలతో అఖిలపక్షం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీపీఎం సానుకూలత వ్యక్తం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టికలను రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రకటించాలని కోరింది.
ఇవీ చూడండి:దేశవ్యాప్తంగా 'పౌర' నిరసనలకు వామపక్షాల పిలుపు