one time settlement in AP: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఓటీఎస్ వసూలుకు లబ్ధిదారులపై ఏపీ ప్రభుత్వం అన్ని అస్త్రాలనూ ప్రయోగిస్తోంది. ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని వసూలుపై దృష్టిసారించింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా వెంకటాపురం పరిధిలోని కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో రెండు వేలకుపైగా పేద కుటుంబాలు ఉంటున్నాయి. ఈ కాలనీకి 2004-05లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో గృహనిర్మాణ సంస్థ అందించిన సొమ్ముతో లబ్ధిదారులు ఇళ్లు కట్టుకున్నారు. ఇన్నాళ్లూ ఇంటిని తమ సొంతమనే భావిస్తున్నామని, ఇప్పుడు ఉన్నట్లుండి అధికారులు వచ్చి ‘మీ పేరిట అప్పుంది... కట్టాలి’ అంటున్నారని వాపోయారు. కరెంటు బిల్లు, ఆధార్‌కార్డు, ఇంటి పట్టా జిరాక్స్ తీసుకెళ్లారని చెబుతున్నారు.
జాతీయ రహదారి పక్కన ఉన్న గ్రామాల ప్రజలు, గ్రామ కంఠం, పోరంబోకు, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారు మాత్రం ఓటీఎస్ చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. పట్టణాల పరిధిలోని వారూ కొంతమేర స్పందిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏపూరు, తోటగూడెం, పెదపాడు, కొత్తూరు, వెంకటాపురం, తంగెళ్లమూడి సచివాలయాల పరిధిలోని లబ్ధిదారులను ‘ఈనాడు డిజిటల్ ప్రతినిధి’ కలిసినప్పుడు తమ ఇబ్బందులను వివరించారు.
వసూలుకు మహిళా పోలీసులు...
one time settlement in andhra pradesh : తహసీల్దారు, ఎంపీడీవో, గృహనిర్మాణశాఖ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వీఆర్వో, వాలంటీర్ల వరకు అందరికీ ఓటీఎస్ వసూలు బాధ్యత అప్పగించారు. కొన్నిచోట్ల మహిళా పోలీసులనూ వినియోగిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏపూరు-2 సచివాలయం, పెదపాడు సచివాలయం పరిధిలోని మహిళా పోలీసుల్ని ఇళ్ల వద్దకు పంపుతున్నారు. కొందరు పేదలు రుణ వివరాలతో కూడిన పత్రాలపై సంతకాలనూ చేయడం లేదు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల, తొండూరు, జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరు పంచాయతీలో చాలామంది సంతకాలు పెట్టలేదు. విజయనగరం మండలం కోరుకుండలో ఇప్పుడికిప్పుడు ఒత్తిడి చేస్తే ఎలా కట్టాలని మహిళలు అధికారుల్ని ప్రశ్నించారు.
ప్రతి సచివాలయం నుంచి రోజుకు 1-4 చొప్పున ..
one time settlement in AP : ఓటీఎస్ వసూలుకు అధికారులు సచివాలయాల వారీగా ఓటీఎస్ లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. రోజుకు కనీసం ఒకరు నుంచి నలుగురు లబ్ధిదారులతో డబ్బులు కట్టించాలని లక్ష్యంగా పెట్టారు. ఇవన్నీ మౌఖిక ఆదేశాలుగానే అధికారులు ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్దేశించిన లక్ష్యంలో రోజుకు 10% సొమ్మును వసూలు చేయాలని ఆదేశాలున్నాయి.
- లబ్ధిదారుల నుంచి మూకుమ్మడిగా వ్యతిరేకత వ్యక్తంకాకుండా ఓటీఎస్ జాబితాను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు సచివాలయం పరిధిలో 217 మందితో జాబితా ఉంటే మొదట 12 మంది పేర్లనే ప్రకటించారు. పెదపాడు, వెంకటాపురం, కొత్తూరు, తంగెళ్లమూడి సచివాలయాల్లో వారానికి 5 నుంచి 10 పేర్లను ప్రకటిస్తున్నారు.
- ఓటీఎస్ పర్యవేక్షణకు సచివాలయాల వారీగా మండలస్థాయిలోని ఇతర అధికారుల్ని ప్రత్యేక అధికారులుగా నియమించారు.
- జిల్లాస్థాయిలో రోజుకు 2 నుంచి 4 సార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు.