ODOP Scheme in Telangana: రాష్ట్రంలో "ఒక జిల్లా - ఒక ఉత్పత్తి పథకం" ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 728 జిల్లాల్లో పండే వ్యవసాయ, ఉద్యాన, సుగంధ పంటల ఉత్పత్తులు గుర్తించి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓడీఓపీ పథకం తీసుకువచ్చింది. వరి, గోధుమ, ముతక, తృణ ధాన్యాలు, పప్పులు, నూనెగింజలు, కూరగాయలు వంటి పంటలను జిల్లాలవారీగా ఎంపిక చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జిల్లా స్థాయిలో పథకం విజయవంతమైంది. రాష్ట్రంలో హైదరాబాద్ సహా 33 జిల్లాల్లో 15 రకాల పంటలు, ఇతర ఉత్పత్తులను పెంచి రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలవారీగా పంటలను లక్ష్యంగా పెట్టుకొని...ప్రణాళికలు రూపొందించింది. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, ఆహార శుద్ధి, మార్కెటింగ్, పరిశ్రమల శాఖల సమన్వయం లేకపోవడంతో పాటు నిధుల కొరత వెరసి అడుగులు ముందుకు పడటంలేదు.
రాష్ట్రంలో ఫలితాలివ్వని ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం
ODOP Scheme in Telangana రాష్ట్రంలో ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం అమలు లోపభూయిష్టంగా మారింది. సాగు ఉత్పత్తులకు బ్రాండ్ సృష్టించి రైతులకు మేలు చేయాలన్న లక్ష్యం పడకేసింది. ఉత్తరప్రదేశ్‌లో విజయవంతం కావటంతో తెలంగాణలోనూ నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు నమోదు చేయవచ్చని ఉద్యాన శాఖ అభిప్రాయపడుతోంది. ఆ దిశగా చర్యలు మమ్మురం చేసింది.
ఓడీఓపీ కింద సృష్టించే ప్రత్యేక బ్రాండ్ల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు పెంచే బాధ్యతలను జాతీయ సహకార మార్కెటింగ్ సమాఖ్య - నాఫెడ్ సంస్థకు కేంద్రం అప్పగించింది. ఈ-కామర్స్ వేదికగా మార్కెట్‌లో వినియోగదారులకు ఉత్పత్తులు లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కానీ, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ప్రత్యేక బ్రాండ్‌లు సృష్టించాలనే ప్రతిపాదన ముందుకు సాగడం లేదు. పంటల సాగు పెంచడం, అదనపు విలువ జోడింపు, ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనలో వ్యవసాయ, ఉద్యాన అనుబంధ శాఖలు పెద్దగా చొరవ చూపలేదు. రైతులకు రాయితీలు, ప్రోత్సహకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. పథకం లక్ష్యం గొప్పదే అయినా ఆచరణలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. నిధులు విడుదల చేసి పక్కా ప్రణాళికతో అమలు చేస్తే విజయవంతవడమే కాకుండా రైతులకు నికర లాభాలు వస్తాయని వ్యవసాయ, ఉద్యాన శాఖలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలో పండించిన పంట ఉత్పత్తులకు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ మార్కెట్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకవట్లేదనే విమర్శలు వస్తున్నాయి.