రాష్ట్రవ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబరాలు అంబరాన్నంటేలా కొనసాగుతున్నాయి. మూడో రోజు వాడవాడలా అతివలంతా ఒక్కచోటి చేరి ఆటపాటలతో ముద్దపప్పు బతుకమ్మను జరుపుకున్నారు. రాజకీయ, ప్రజా సంఘాలు మహిళలకు సంబంధించిన ప్రత్యేక థీమ్‌లతో వేడుకలు నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రవీంద్రభారతిలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మూడోరోజు జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే సీతక్క మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయక మహిళలు ఆటపాటలతో హోరెత్తించారు. కూకట్‌పల్లి కోర్టులో మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆటపాటలతో సందడి చేశారు. ఆడపిల్లలను కాపాడుకుందామంటూ ఐద్వా ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో బతుకమ్మ సంబరాలు జరిగాయి.