Omicron Cases Hyderabad Today : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ భయాందోళనలు కొనసాగుతున్న వేళ.. విదేశాల నుంచి భాగ్యనగరానికి వస్తున్న వారు తప్పుడు చిరునామాలు ఇస్తూ అధికారులకు మస్కా కొడుతున్నారు. వైద్య సిబ్బందిని, పోలీసులను తిప్పలు పెడుతున్నారు. ఈ నెల 14న కెన్యా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వైద్యాధికారులు అతను విమానాశ్రయంలో ఇచ్చిన చిరునామా ప్రకారం పారామౌంట్ కాలనీకి వెళితే తప్పుడు అడ్రస్ అని తేలింది. పోలీసుల సాయంతో అతని ఆచూకీ గుర్తించారు. పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.
చాలామందిదీ అదే దారి..
Omicron Cases Hyderabad Latest : విదేశాల నుంచి వచ్చే చాలామంది తప్పుడు చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇచ్చి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ప్రస్తుతం మాల్దీవులు, కౌలాలంపూర్, కొలంబో, సింగపూర్, బ్రిటన్, షార్జా, అబుదాబీ, దోహా, దుబాయ్, బహ్రెయిన్, మస్కట్, కువైట్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. బ్రిటన్, సింగపూర్ నుంచి వచ్చిన వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు పోలీసులు, వైద్య సిబ్బంది వద్దకు చేరుతున్నాయి. పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్తే.. అక్కడ అలాంటి వారు ఎవరూ లేరనే సమాధానం వస్తుండటంతో అవాక్కవుతున్నారు. గోల్కొండ పరిధి పారామౌంట్‌కాలనీలో ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో వైద్య ఆరోగ్య, జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి పరీక్షలు చేపట్టారు. చాలామంది విదేశీయులు సహకరించడం లేదని వాపోతున్నారు. పోలీసుల సాయం తప్పనిసరి అవుతోందని చెప్పారు.