పోలీసుల అభిమానాన్ని పొందిన బామ్మ ఇక లేదు. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ 30 ఏళ్లుగా గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్కు సేవలందిస్తున్న వృద్ధురాలు ఇవాళ కన్నుమూసింది. 80 ఏళ్ల బానావత్ మూగమ్మకు మాటలు రావు అయినా పోలీస్ స్టేషన్‌లో మహిళా ఖైదీలకు కాపలాగా ఉండేది. మహిళా కానిస్టేబుళ్లు లేని సమయంలో మహిళా నిందితులను తనిఖీ చేయడంలో తనదైన పాత్ర పోషించేది. తన అనుకునే వారు ఎవరూ లేకపోవడం వల్ల పోలీసులే ఆమెను పోషిస్తూ వచ్చారు.
సెంట్రీ లాగానే 24 గంటలపాటు స్టేషన్ పోలీసులకు పూర్తి సహకారాలు అందించేది. అలా సిబ్బందితోపాటు అధికారులకు ఆమెతో అనుబంధం ఏర్పడింది. మంగళవారం వేకువజామున మూగమ్మ కన్నుమూసింది. బామ్మ ఇక లేదనే విషయాన్ని జీర్ణించుకోలేక తాడేపల్లి పోలీసులు కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్సై వినోద్ కుమార్ వృద్ధురాలి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.