తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఎంపీ సోదరి అరాచకం ... మా ఇల్లు లాక్కున్నారు' - ఎంపీ నందిగం సురేష్‌ సోదరి తమ ఇల్లు లాక్కున్నారన్న వృద్ధ దంపతులు

MP Nandigam Suresh News : ఎంపీ నందిగం సురేశ్‌ సోదరి బలవంతంగా తమ ఇంటిని లాక్కున్నారని.. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన ఉప్పు పిచ్చయ్య, భవానీ దంపతులు ఆరోపించారు. వైకాపా కార్యాలయం నిర్మిస్తామని..బలవంతంగా తమ ఇంటిని లాక్కున్నారని వాపోయారు. 15 రోజులుగా రోడ్డు పైన ఉంటున్నామంటూ ఆవేదనకు గురయ్యారు. శుక్రవారం తెదేపా అధినేత చంద్రబాబును.. పార్టీ కార్యాలయంలో కలిసిన వారు.. తమ గోడును చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని చంద్రబాబును వేడుకున్నారు.

MP Nandigam Suresh News
MP Nandigam Suresh News

By

Published : Apr 30, 2022, 9:15 AM IST

Updated : Apr 30, 2022, 11:09 AM IST

Old couple complaint on MP Nandigam suresh sister : వైకాపా కార్యాలయం ఏర్పాటు చేస్తామని తమ ఇంటిని ఎంపీ నందిగం సురేశ్‌ సోదరి బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని.. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన ఉప్పు పిచ్చయ్య, భవానీ దంపతులు శుక్రవారం తెదేపా అధినేత చంద్రబాబును వేడుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును కలిసిన వారు తమ గోడు వెళ్లబోసుకుని కన్నీరుమున్నీరయ్యారు.

పోలీసులు కూడా వారి పక్షానే మాట్లాడుతున్నారని, తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ఎంపీ సోదరి నియమించిన మనుషులు తమ సామాను తీసుకెళుతుండగా వీడియో తీస్తున్న తన కుమారుడిని వెంటబడి కత్తులతో చంపబోయారని పిచ్చయ్య ఆరోపించారు.

‘‘ఎంపీ నందిగం సురేష్‌ సోదరి పేదోళ్ల ఇళ్లు ఎక్కడున్నాయో కనిపెడుతున్నారు. అవసరానికి యాభై వేలో, లక్ష రూపాయలో ఇస్తున్నారు. మా దగ్గరకు చీటీలు వేస్తున్నామని వచ్చారు. ఏవో కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. నాకు రూ.6 లక్షలు ఇచ్చానని, ఇల్లు తనకు ఇచ్చేయాలని అంటున్నారు. ఎంపీ సోదరి ఇటీవల పది మంది కుర్రాళ్లను తీసుకొచ్చి బెదిరించారు. పార్టీ ఆఫీసు కోసం నా ఇల్లు కొన్నానని, ఖాళీ చేయకపోతే పోలీసుస్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుందని బెదిరించారు. ఇల్లు ఖాళీ చేయకపోతే మీ ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏమవుతుందో చూసుకో అని హెచ్చరించారు. ఆ తర్వాత నా ఒంట్లో బాగా లేక ఆస్పత్రిలో చేరాను. ఆ సమయంలో రౌడీషీటర్లను తీసుకుని మా ఇంటికి వచ్చి తాళం పగులగొట్టి ఇంట్లోని మూడున్నర కాసుల చైను, రూ.15 వేల నగదు, బ్యాంకు చెక్‌బుక్కులు, సామాన్లు తీసుకెళ్లిపోయారు. ఇంటిని వాళ్లు స్వాధీనం చేసుకున్నారు. మేం 15 రోజులుగా రోడ్డుపై ఉంటున్నాం." - వృద్ధ దంపతులు

"పోలీసుస్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తే.... ఆమె సామానే నా ఇంట్లో పెట్టిందని, మళ్లీ తీసుకెళ్లిందని పోలీసులు అంటున్నారు. నేను ఆమె నుంచి రూ.ఆరు లక్షలు తీసుకున్నానని, తాను పక్క నుంచి చూశానని తాడేపల్లి సీఐ చెప్పారు. నేను రూ.6 లక్షలు ఆమె నుంచి తీసుకుంటే... రాసుకున్న కాగితాలు ఉండాలి కదా? అవి చూపించమని అడిగాను. ఏవో కాగితాలు చెప్పి చూపించారు. మా నాన్న మూడేళ్ల క్రితం చనిపోతే... ఆరు నెలల క్రితం ఆమె పేర ఆస్తి రాసినట్టుగా కాగితాలు సృష్టించారు...’’ అని పిచ్చయ్య వివరించారు. తనకు మరో దారి లేక చంద్రబాబును కలిసి న్యాయం చేయమని కోరారని, పార్టీ అండగా ఉంటుందని, తన తరఫున పోరాడతామని చెప్పారని.. పిచ్చయ్య పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 30, 2022, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details