తెలంగాణ

telangana

ETV Bharat / city

వయసులో అమ్మ... వృద్ధాప్యంలో నువ్వెవరమ్మా..? - వృద్ధాశ్రమాల వార్తలు

నేటి బాలలే.. రేపటి పౌరులు. మరీ నేటి పౌరులే రేపటి వృద్ధులు కదా..! ఈ చిన్న విషయం మరిచిపోయి ఎందుకు తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. రేపటి రోజున.. మనమూ వృద్ధులమే. మన భాష.. యాస.. అన్నీ నేర్చుకున్నవి తల్లి నుంచే. 'దిల్లీకి రాజైనా తల్లికి కొడుకే' అని గట్టిగా చెప్పే మన దేశంలో వృద్ధాప్యంలోకి వెళ్లిన తల్లిని ఎందుకలా దూరంగా ఉంచుతున్నాం. ఆలోచనా తీరులో ఎందుకీ మార్పు?

old-age-homes-increasing-in-india
వయసులో అమ్మ... వృద్ధాప్యంలో నువ్వెవరమ్మా..?

By

Published : Mar 21, 2021, 9:30 AM IST

  • నా కళ్ల అద్దాలంటే నాకు ప్రేమ..
  • నాకు ఆసరాగా నిలిచే.. చేతికర్రంటే నాకు ప్రాణం..
  • ఎందుకంటే.. నా జీవితమంతా వాటిపైనే ఆధారపడ్డా..
  • అవి నన్ను అసహ్యించుకోవు నా కన్నకొడుకుల్లా..!

ప్రతి ఊరిలో ఏదో ఒక గడపలో వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదనే వార్త. చిన్నప్పుడు ఆలనా పాలానా చూసుకునే తల్లిని.. కనీసం గౌరవించక రోడ్డుపై వదిలేస్తున్న దృశ్యాలెన్నో. బిడ్డకు ఆకలి ఎప్పుడవుతుందో తల్లికి తెలుసు.. కానీ చెప్పకుండానే... గడప నుంచి తల్లిని గెంటేస్తున్న సుపుత్రులు ఎంతో మంది. ప్రపంచంలోనే ఎక్కువ మంది యువకులున్న నేటి భారత్... 2025 నాటికి 15.8కోట్ల మంది వృద్ధులకు ఆవాసం అవనుందని అంచనా. మరి వారిని చూసుకునేవారేవరు..?

గుండెలపైకి ఎత్తుకుని పెంచిన వారి.. గుండెపైనే తంతున్న ఘటనలు కోకొల్లలు. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలపై కఠినంగా వ్యవహరిస్తూ... వృద్ధుల పక్షాన ఈ మధ్య కోర్టులు నిలవటం మంచి విషయం. గ్రామాల్లో ఉపాధి కొరత... పెరుగుతున్న పట్టణికీకరణ... పడిపోతున్న మానవ సంబంధాలు.. మానవతా విలువల పతనానికి దారితీస్తున్నాయి. వయసైపోయిన వారిలో మగవారికంటే ఆడవారే ఎక్కువ నిర్లక్ష్యానికి గురవుతున్నారట.

వయసుమళ్లిన ఆడవారు మానసికంగా కుంగిపోతున్నారే తప్ప.. సమస్య చెప్పుకోలేరనేది వాస్తవం. ధైర్యం చేసి చెప్పినా వినేవారు ఎవరు..?. ముసలివారి కోసం ప్రత్యేక ప్రభుత్వ పథకాలు, చట్టాలున్నట్లు ఎవరికి తెలుసు..? మనుషుల మనసుల్లో వస్తున్న మార్పులతో వృద్ధాశ్రమాలు పుట్టుకొస్తున్నాయి. ఈ ఆశ్రమాల్లో వసతులున్నాయేమో.. తప్ప మానసిక ఆనందం లేదు.

చట్టం.. చెప్పే మాట

వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లలకు చట్టపరమైన బాధ్యత కూడా..! తల్లిదండ్రులు, వృద్ధుల భృతి సంరక్షణ చట్టం-2007 ప్రకారం.. వృద్ధులైన తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి జీవన భృతి, పోషణ, వైద్య సదుపాయాల ఖర్చులను పొందవచ్చు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా, వారి పోషణ భారంగా భావించి ఇంటి నుంచి గెంటేసినా ఆ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించి, న్యాయం పొందవచ్చునని దిల్లీ హైకోర్టు ఒక కేసులో స్పష్టం చేసింది. తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత కూతుళ్లపైనా ఉంటుందని 1987లోనే సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

-ఈ చట్టం కింద బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చు. పిల్లలు తమ తల్లిదండ్రులను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని రుజువైతే మూడు నెలల జైలు, 5 వేల వరకు జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

-పోషిస్తామని నమ్మించి, ఆస్తులు తమ పేరు మీద రాయించుకుని ఆ తర్వాత వారిని వదిలేస్తే.. ఆ ఆస్తికి సంబంధించిన దస్తావేజులు రద్దవుతాయి. ఈ చట్టం పరిధిలోకి వచ్చే కేసులను కోర్టులు సుమోటోగా స్వీకరించవచ్చు. పోలీసులు, తహసీల్దార్లు, న్యాయవాదులు, సామాన్య పౌరులు బాధితుల తరఫున న్యాయపోరాటం చేయొచ్చు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వృద్ధులు, తల్లిదండ్రుల సంరక్షణ కోసం ఓ ప్రత్యేక విభాగం ఉంటుంది.

ఇప్పుటి వాళ్లకు వృద్ధులను విహారయాత్రలకు తీసుకెళ్లాలంటే మహా చిరాకు. వారిపై ప్రభుత్వం నిషేధం విధించినట్లు చేస్తున్నారు పిల్లలు. కాస్త వారిని బయటకు తీసుకెళ్తేనేగా ప్రశాంతత. చిన్నప్పుడు మీరు ఏడుస్తుంటే.. మీ సంతోషం కోసం ఎన్ని మైళ్లు ఎత్తుకుని తీసుకెళ్లారో ఒక్కసారి గుర్తు చేసుకోండి.

ABOUT THE AUTHOR

...view details