గ్రేటర్ పోలింగ్‌లో వృద్ధులు, వికలాంగులు చైతన్యం కనబర్చారు. వయసు మీదపడి కదలలేని స్థితిలోనూ పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ఉద్యోగులు, యువకులు ఓటు వేసేందుకు బద్ధకం కనబర్చినా... సీనియర్ సిటిజన్స్ ఉత్సాహంగా తమ ఓటు నమోదు చేశారు. ఓటు వేసేందుకు వయసు అడ్డుకాదంటూ పోలింగ్ కేంద్రాలకు కదిలారు. వైకల్యాన్ని సైతం ఎదిరించి అనేక మంది ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఓటు విలువ తెలిసిన విద్యాధికులు సైతం మనకెందుకులే అని చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చున్న వేళ.... కర్ర పట్టుకుని కదిలి సాధారణ పౌరుడి వజ్రాయుధం విలువ చాటిచెప్పారు.
చెంపపెట్టులా
ఎప్పుడూ నాయకులను తిట్టిపోస్తూ ఉండే విద్యాధికులు, ఉద్యోగులు, యువతకు... వేలిపై సిరాచుక్కతో వృద్ధులు చెంపపెట్టు పెట్టారు. వందేళ్ల వయసులోనూ కరోనా భయాన్ని పక్కనబెట్టి మహానగర నిర్మాణంలో తమ వంతు పాత్రను పోషించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సౌకర్యాలను వినియోగించుకుని తమ ఓటును నమోదు చేశారు. గెలుపవరిదైనా ఓటు వేయడం తమ అస్తిత్వమని అనేక మంది వృద్ధులు అభిప్రాయపడ్డారు.