రాష్ట్రంలో పన్ను చెల్లించకుండా సాగుతున్న కోట్ల రూపాయల వ్యాపారాలు, జీఎస్టీ ఎగవేత అక్రమాలు ఖజానాకు భారీగా గండికొడుతున్నాయి. రాబడులు తగ్గిన నేపథ్యంలో జీఎస్టీ అధికారులు అందుకు దారితీసిన అంశాలపై అధ్యయనం చేశారు. జీఎస్టీ చట్టంలోని వివిధ అవకాశాలను వినియోగించుకుని పలువురు అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వాహనాల తనిఖీలు తగ్గిన నేపథ్యలో యథేచ్ఛగా సరకుల అక్రమ రవాణాకు తెరతీసినట్లు గుర్తించారు. నిత్యం కోట్ల రూపాయల విలువైన వస్తువులు వివిధ రాష్ట్రాలను దాటి హైదరాబాద్‌కు చేరుతున్నట్లు వెల్లడైంది.
దిల్లీ, మహారాష్ట్ర నుంచి జీరో సరకులు
దిల్లీ నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్‌లు భారీగా అక్రమంగా రాష్ట్రానికి చేరుతున్నాయి. వాహనాలు రెండు మూడు రోజులు ప్రయాణించి రాష్ట్రానికి చేరుతున్నా ఎప్పుడో ఒకసారి గానీ పట్టుబడటంలేదు. గిడ్డంగులకు చేరేలోపే సరకును గుర్తిస్తే తప్ప పన్ను వసూలుకు అవకాశం ఉండటం లేదని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
మూడు నెలల క్రితం దిల్లీ నుంచి మొబైల్‌ఫోన్లు, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలతో నిండిన లారీని వాణిజ్య పన్నులశాఖ అధికారులు హైదరాబాద్‌లో పట్టుకున్నారు. లక్షల రూపాయల విలువైన సరకుకు ఎలాంటి బిల్లులు లేకపోగా, వేబిల్లు కూడా లేదు. మరో పదిహేను నిమిషాల్లో గిడ్డంగికి చేరుతుందనగా అధికారులు పట్టుకున్నారు.
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల మీదుగా వివిధ ఉత్పత్తులు హైదరాబాద్‌కు చేరుతున్నాయి. జీఎస్టీ చట్టం ప్రకారం వస్తువులు తయారీ చేసే రాష్ట్రాలకు కాకుండా వస్తువులను వినియోగించే రాష్ట్రాలకు జీఎస్టీ అందుతుంది. ఈ నేపథ్యంలో జీరో వ్యాపారంతో వచ్చే సరుకులతో భారీగా జీఎస్టీ రాబడికి గండిపడుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఏటా సుమారు రూ.500 కోట్లకు పైగా జీరో వ్యాపారంతో పన్ను ఎగవేత జరుగుతున్నట్లుగా గుర్తించారు.