Raids on movie theaters in AP: ఏపీలో సినిమా థియేటర్లపై దాడులు హాట్ టాపిక్‌గా మారాయి. గడిచిన కొద్దిరోజులుగా అక్కడక్కడ దాడులు జరిగితే.. 3 రోజుల్లో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంది. దాదాపు ఏ సెంటర్లో చూసినా.. తనిఖీల అంశం థియేటర్ యజమానులను బెంబేలెత్తిస్తోంది! ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు ముమ్మరం చేసేస్తున్నారు అధికారులు..! జేసీల ఆధ్వర్యంలో సాగుతున్న ఈ తనిఖీల్లో రెవెన్యూ, పోలీసులతో పాటు పలు విభాగాల అధికారులు పాల్గొంటున్నారు. ప్రతి అంశాన్ని సిరీయస్గానే పరిగణిస్తున్నారు. కొన్ని థియేటర్లను ఏకంగా సీజ్ చేసేశారు..! ఈ పరిణామాలపై ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల అయితే.. స్వయంగా యజమాన్యాలే థియేటర్లను మూసివేసే చిత్రాలు దర్శనమిస్తున్నాయి..! మరోవైపు తాజా పరిణామాలపై హీరో నాని..చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నాని కామెంట్స్‌పై ఏపీ మంత్రులు ఘాటుగానే స్పందించారు. హీరో సిద్ధార్థ్ కూడా పలు కామెంట్స్ చేశాడు.
థియేటర్లపై దాడులు.. కారణాలు..!
సినిమా థియేటర్లపై దాడులకు ఈ ఒక్క కారణమనే చెప్పలేం. థియేటర్లలో జీవో నెంబర్ 35 ప్రకారం టికెట్ రేట్లు, ఆన్ లైన్ టికెట్ల విధానం అమలు, సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు, క్యాంటీన్లలో ధరలు, వెహికల్ పార్కింగ్, పరిశుభ్రత వంటి అంశాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. తనిఖీల్లో భాగంగా.. ఫైన్లు విధిస్తున్నారు. తీవ్రతను బట్టి... సీజ్ చేసేస్తున్నారు..! మరికొన్నిచోట్ల నోటీసులతో సరిపెట్టేస్తున్నారు..! లైసెన్స్ లేకపోయినా, నిబంధనలు పాటించకపోయినా తగ్గేదేలే అన్న పరిస్థితి నెలకొంది. ఏపీలోని ప్రధాన సెంటర్లలోని ఏదో ఒక థియేటరపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. దాదాపుగా ఈ సంఖ్య వందల్లోనే ఉంది. ఒక్క కృష్ణా జిల్లాలోనే సీజ్ చేసిన థియేటర్ల సంఖ్య చూస్తే 14కి పైగా ఉంది. విజయనగరంలో 6, కర్నూలు జిల్లాలో ఒక థియేటర్‌ను మూసివేశారు. చిత్తూరు జిల్లాలోని పదుల సంఖ్యలో థియేటర్ల గేట్లకు తాళాలు పడ్డాయి.
ఎగ్జిబిటర్ల ఆందోళన.. స్వయంగా మూసివేత!
Exhibitors closed theatres in AP: థియేటర్లపై వరుస దాడులతో ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కరోనా కారణంగా సినిమా రంగం తీవ్ర నష్టాల్లో ఉందంటున్నారు. థియేటర్ల పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఈ ఏడాది జూలై నుంచి థియేటర్ల సగం సామర్థ్యంతో టికెట్లు అమ్ముకోవచ్చని సర్కార్ అనుమతి ఇవ్వటం ఎగ్జిబిటర్లకు ఉపశమనం ఇచ్చింది. అంతలోనే ఈ దాడులు ప్రారంభం కావటంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లైందని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు.
పలుచోట్ల ప్రస్తుత ప్రభుత్వ ధరల ప్రకారం థియేటర్‌ను నడపలేమంటూ.. స్వయంగా మూసివేస్తున్నాయి యజమాన్యాలు. విశాఖ జిల్లాలోని అగ్రహారంలో బాలత్రిపుర సుందరి థియేటర్ యజమాన్యం .. ఈ కారణంతోనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీల పరిధిలో నడిచే థియేటర్ల విషయంలో ఈ పరిస్థితి నెలకొంది. కొవిడ్ నుంచి బయటపడే తరుణంలో సర్కారు టికెట్ల ధరలు తగ్గించేయడంతో ఆర్థిక భారాన్ని మోయలేక... తూర్పుగోదావరి జిల్లాలో 45 మంది యజమానులు గురువారం థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ, కృష్ణా జిల్లా నందిగామ, మైలవరం, పెనుగంచిప్రోలు, శ్రీకాకుళం జిల్లా కొత్తూర్లలో తమ థియేటర్లకు యజమానులే స్వయంగా తాళాలు వేసుకున్నారు. ఈ క్రమంలో రాజమహేంద్రవరం గ్రామీణంలోని నామవరం, ధవళేశ్వరం... కాకినాడ గ్రామీణంలోని వాకలపూడి, జగ్గంపేట, రావులపాలెం, గోకవరం, అమలాపురం, రాయవరం, మలికిపురం, సీతానగరం, రాజోలు, కోరుకొండ, ఉప్పాడ, ముమ్మిడివరం, గొల్లప్రోలు తదితరచోట్ల సినిమా హాళ్లను యజమానులు మూసేస్తున్నారు.
యజమానులు చెబుతున్న కొన్ని ఇబ్బందులు ఇవే..!
- ఏపీలో సుమారు వెయ్యికి పైగా థియేటర్లు ఉన్నాయి. ఒక్కో థియేటర్ యాజమాన్యం.. ప్రేక్షకుల సామర్థ్యం ప్రకారం నిర్వహణ ఖర్చుల కింద రూ. 3 నుంచి రూ.5 లక్షల వరకు వెచ్చిస్తున్నామని చెబుతోంది.
- ఒక్కో థియేటర్‌కు సగటున 50 మంది ఉపాధి పొందుతున్నారు.
- కొవిడ్ కారణాంగా ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్ బిల్లుల మాఫీ ఇంకా అమలు కాకపోవటం.
- పెరిగిన విద్యుత్ ఖర్చులు భారంగా మారటం.
- ఓటీటీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది.
- టికెట్ల ధరలు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లటం.
- గతంలో గ్రామాలు, పట్టణాల్లో పన్నుల విధింపులో తేడాలు ఉండేవి. కానీ ప్రస్తుత అన్నిచోట్లా ఒకే రకమైన పన్ను విధిస్తున్నారు.
- ప్రభుత్వ జీవో 35 ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లోని ఏసీ థియేటర్లలో టికెట్ల ధరలు.. వరుసగా రూ.10, రూ.15, రూ. 20గా ఉన్నాయి. నాన్ ఏసీ థియేటర్లలో రూ. 5, రూ. 10, రూ.15 గా ఉన్నాయి.
- మున్సిపాలిటీ పరిధిలోని థియేటర్లలో రూ. 30, రూ.50, రూ. 70గా ఉన్నాయి. కార్పొరేషన్ పరిధిలో చూస్తే.. రూ. 40,రూ.60, రూ. 100గా ఉన్నాయి.
హీరో నాని వర్సెస్ మంత్రులు... ట్వీట్‌తో సిద్ధార్థ్ ఎంట్రీ!
AP Ministers Vs Hero Nani: ఏపీలోని తాజా పరిణామాలపై హీరో నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల విషయమై ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని హీరో నాని తప్పుబట్టారు. టికెట్ రేట్లను తగ్గించడం ప్రేక్షకులను అవమానించినట్లేనని అన్నారు.