తెలంగాణ

telangana

By

Published : Jul 9, 2021, 10:28 AM IST

ETV Bharat / city

HARITHA HARAM: మీరు నాటేస్తే.. మేం వేటేస్తాం!

హరితహారం(HARITHA HARAM) కార్యక్రమంలో భాగంగా నాటుతున్న చెట్లు కేవలం అంకెలుగానే మిగిలిపోతున్నాయి. పలు చోట్ల పెట్టిన మొక్కలకు సంరక్షణ లేక చచ్చిపోతున్నాయి. మరికొన్ని చోట్ల... చెట్ల కింద, విద్యుత్ తీగల కింద మొక్కలు నాటుతు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.

officers-negligence-in-haritha-haram-program
మీరు నాటేస్తే.. మేం వేటేస్తాం!

భద్రాచలం గోదావరి కరకట్ట వద్ద మూడేళ్ల క్రితం హరితహారం(HARITHA HARAM)లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో సుమారు 800 మొక్కలు నాటారు. గార్డెనింగ్‌(GARDENING) కూడా ఏర్పాటు చేశారు. తర్వాత సంరక్షణను మరిచారు. పట్టుమని 100 మొక్కలు కూడా బతకలేదు. వరుసగా రెండేళ్లపాటు నాటడం, చనిపోవటం పరిపాటిగా మారింది. మళ్లీ ఈ ఏడాది గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నాటేందుకు గుంతలు తీసి సిద్ధంగా ఉంచారు.

ముల్కలపల్లి మండలం మాదారంలో విద్యుత్‌ లైను కిందనే మొక్కలు నాటారు. గతంలో నాటినవి ఏపుగా పెరగటంతో పల్లె ప్రగతి పవర్‌ డేలో భాగంగా కొమ్మలు కొట్టేశారు. ఈసారి హరితహారంలో కొమ్మలు నరికిన చెట్ల పక్కనే మళ్లీ కొత్తవి నాటారు.

పైన చిత్రాల్లో ఉదాహరణలు హరితహారం కార్యక్రమంలో అధికార యంత్రాంగం నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనాలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలాచోట్ల హరిత యజ్ఞం అంకెల గారడీగా మారుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్న

తాపత్రయంతో అధికార యంత్రాంగం ఇబ్బడిముబ్బడిగా మొక్కలు నాటుతున్నా వాటి సంరక్షణ మాత్రం చాలాచోట్ల పట్టడం లేదు. ‘నాటామా.. లెక్కల్లో చూపామా’ అన్న చందంగా తయారైంది పరిస్థితి. నాటిన చోటే నాటుతుండటం ఒక ఎత్తయితే, శాఖల మధ్య సమన్వయ లోపంతో ఇంకొన్ని చోట్ల ఏపుగా పెరిగాక నేలవాలుతున్నాయి. ప్రణాళికా రాహిత్యంతో ఏటా రూ.కోట్లు వృథా అవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో 2021-22 ఏడాదికి హరితహారం(HARITHA HARAM) లక్ష్యంగా భారీగానే ఉంది. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలకు బాధ్యతను నిర్దేశించారు. ముఖ్యంగా డీఆర్‌డీఏ, అటవీ, పంచాయతీ రాజ్‌, పురపాలికలు, సింగరేణి, ఎక్సైజ్‌, వ్యవసాయ, నీటిపారుదల, విద్య, దేవాదాయ శాఖలు ఈ క్రతువులో పాలుపంచుకుంటున్నాయి.

  • నాటిన మొక్కలు ఏ మేరకు సంరక్షిస్తున్నారన్నదే సమస్య. ఏటా లక్షల్లో నాటినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా వాటిలో ఎన్ని ఉన్నాయన్న సంగతి ప్రభుత్వ శాఖలు గుర్తెరగడం లేదు.
  • కింది స్థాయి అధికారులు, సిబ్బందిపై లక్ష్య సాధనకు ఒత్తిడి చేస్తున్నారు. తక్కువ సమయం ఇచ్చి ఎక్కువ నాటాలంటూ ఆదేశిస్తుండటంతో వారు నాటామా? వదిలేశామా? అన్న ధోరణిలో ఉంటున్నారు.
  • కొన్నిచోట్ల గతేడాది నాటిన మొక్కల పక్కనే మళ్లీ కొత్తవి ఉంచుతున్నారు.
  • గ్రామాలు, పట్టణాల పరిధిలో ట్రీగార్డు ఏర్పాటు చేయాలన్న నిబంధనలున్నా ఆచరణ సాధ్యం కావటం లేదు. నాలుగు రోజుల్లోపే పశువులు మేయడమో, ఇతర కారణాలతోనో అదృశ్యమవుతున్నాయి.
  • గ్రామసభలు నిర్వహిస్తూ మొక్కల్ని పంపిణీ చేస్తున్నారు. జిల్లా వారీగా చూస్తే లక్షలాదిగా పంచుతున్నా వాటిని తీసుకున్న వారు సద్వినియోగం చేశారా లేదా అన్న చెక్‌పాయింట్‌ ఉండటం లేదు.

నాటుడు.. నరుకుడు

ప్రభుత్వ శాఖల్లో సమన్వయం లోపం శాపంగా మారుతోంది. ముందస్తు ప్రణాళిక లేకుండా మొక్కలు నాటుతున్న(PLANTATION) శాఖలు కొన్నయితే.. శాఖాపరమైన చర్యల్లో భాగంగా వాటిని తొలగిస్తున్నవి మరికొన్ని. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆదుర్దాతో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రంగంలోకి దిగుతున్నారు. రెండేళ్లు, మూడేళ్ల తర్వాత ఏపుగా పెరిగాక విద్యుత్‌ లైన్లకు అడ్డుగా ఉన్నాయంటూ ఆ శాఖ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. ఉభయ జిల్లాల్లో ప్రస్తుత పల్లె(RURAL DEVELOPMENT), పట్టణ ప్రగతిలో(URBAN DEVELOPMENT) ఈ తరహా ఘటనలు అధికంగా వెలుగుచూశాయి. తీగలకు దూరంగా నాటాలన్న యోచన ముందే చేస్తే రూ.లక్షల ప్రజాధనం వృథా కాకుండా ఉంటుంది.
నిబంధనలకు విరుద్ధంగా అవెన్యూ ప్లాంటేషన్‌

ఎవెన్యూ ప్లాంటేషన్‌(AVENUE PLANTATION) పేరుతో సామూహిక వన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ఉభయ జిల్లాల్లో విరివిగా మొక్కలు నాటుతున్నారు. ప్రభుత్వ స్థలాలు, ఆర్‌అండ్‌బీ దారులకు ఇరువైపులా, చెరువు గట్టు ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వైకుంఠథామాలు, ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున వనీకరణ చేయాలన్నది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఇందులో కూడా సంరక్షణ ఎవరికీ పట్టడం లేదు. చాలాచోట్ల నిబంధనల ప్రకారం నాటడం లేదు. ఇటీవల జూలూరుపాడు మండలంలో రహదారికి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ తీరుపై భద్రాద్రి కలెక్టర్‌(BHADRADRI COLLECTOR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కటే వరుస నాటి ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమష్టిగా బాధ్యతను భుజానికెత్తుకుంటేనే హరితహారం లక్ష్యం నెరవేరుతుంది. ప్రభుత్వ శాఖలు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఫలితాలు సాధ్యమవుతాయి.

ఇదీ చూడండి:Telangana Tourism : రాష్ట్రంలో మొదలైన పర్యాటక సందడి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details