తెలంగాణ

telangana

ETV Bharat / city

Cherlapally Central Jail: కోర్టుకు ఖైదీల లేఖ.. 'వైవాహిక జీవితం' కల్పించాలంటూ..! - చర్లపల్లి ఖైదీల డిమాండ్స్

Cherlapally Central Jail : తెలంగాణలో కీలకమైన కేంద్ర కారాగారంలో నెలక్రితం.. ఓ ఉన్నతాధికారి ఏడుగురు ఖైదీలపై ప్రదర్శించిన దాష్టీకం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితులంతా న్యాయస్థానానికి, సీఎంవోకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ అధికారిని బదిలీపై వేరే చోటుకు పంపారు. ఖైదీలను మరో జైలుకు తరలించారు. అయితే.. న్యాయస్థానానికి బాధితులు రాసిన లేఖలో.. కొన్ని అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ అవేంటంటే..?

Cherlapally Central Jail
Cherlapally Central Jail

By

Published : Feb 24, 2022, 8:26 AM IST

Cherlapally Central Jail : సంస్కరణాలయాలుగా ఉండాల్సిన జైళ్లలో ఇప్పటికీ ఎన్నో అరాచకాలు.. అవాంఛనీయ పరిణామాలు! తెలంగాణలో కీలకమైన కేంద్ర కారాగారంలో ఉన్నతాధికారి ఒకరు ఏడుగురు జీవిత ఖైదీలను తీవ్రంగా కొట్టగా.. బాధితులు న్యాయస్థానానికి లేఖ రాయడం.. ఆ ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడటం వంటి పరిణామాలు జైళ్ల శాఖలో కలకలం రేకెత్తిస్తున్నాయి. నెల క్రితం జరిగిన ఈ పరిణామాలపై అంతర్గత విచారణ జరుగుతోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి..

Prisoners Letter to Court : అప్పట్లో తమ శాఖలోని ఉన్నతాధికారుల ఆశీస్సులు ఉండటంతో జైల్లో ఆ అధికారి ఎంత చెబితే అంత అన్నట్లుగా ఉండేది. జైల్లో రోజువారీ కార్యక్రమాల నిర్వహణలో కూడా నమ్మకస్తులైన ఖైదీలకు ఆయన కీలక బాధ్యతలు అప్పగించేవారు. కంప్యూటర్‌ మీద కూర్చుని ఇంటర్నెట్‌ ద్వారా చేసే కొన్ని పనుల్ని కొందరితో చేయించేవారు. అయితే ‘నమ్మకస్తులైన ఖైదీలకు’, ఆయనకు మధ్య ఎందుకో కొంత ఎడం పెరిగింది. అప్పటివరకు నమ్మినబంట్లుగా ఉన్నవారే జైల్లో సౌకర్యాల లేమిపై ప్రశ్నించటం, ఎదురుతిరగటం ఆయనకు కంటగింపుగా మారింది. దీంతో వారిని ఓరోజు రాత్రివేళ జైల్లోనే ఖైదీలు వినియోగించే ఓ పరిశ్రమ వద్దకు తీసుకెళ్లి లాఠీలకు పనిచెప్పారు. వారు అరిచినా బయటకు వినిపించకుండా ఉండడానికి అక్కడి యంత్రాల్ని ఆన్‌ చేసి.. మరికొందరు అధికారులు, సిబ్బందితో కలిసి ఏడుగురు ఖైదీలను లాఠీలతో చితకబాదారు.

గళమెత్తారు.. లేఖ రాశారు..

Prisoners Letter to CMO : అప్పటికి ఊరుకున్న బాధితులు ఆ తర్వాత తమకు జరిగిన అన్యాయంపై గళమెత్తారు. ఇంటర్నెట్‌ మీద పని చేసే క్రమంలో న్యాయస్థానంతోపాటు సీఎం, పీఎం కార్యాలయాలకూ లేఖలు పంపారు. దీంతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సభ్యులు వచ్చి విచారణ జరిపారు. అధికారుల దాడిలో తమ దుస్తులకు అంటిన రక్తపు మరకల్ని బాధితులు వారికి చూపించారు. ప్రాణభయముందని మొర పెట్టుకోవడంతో కొద్దిరోజుల క్రితం వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అలాగే ఆ ఉన్నతాధికారిని బదిలీ చేసి అంతర్గత విచారణ ప్రారంభించారు.

‘సంసారం’ కావాలని కోరిక

Cherlapally Prisoners Demands : ఉన్నతాధికారి కొట్టడంపై ఫిర్యాదుతోపాటు బాధిత ఖైదీలు రాసిన లేఖలోని కొన్ని అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. ఓపెన్‌ ఎయిర్‌ జైలులోని ఖైదీలకు వైవాహిక జీవితం గడిపే హక్కు కల్పించాలంటూ వారు విన్నవించడం జైళ్లశాఖ ఉన్నతాధికారుల్ని విస్తుపోయేలా చేసింది. అమెరికాలోని మూడు, నాలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి సదుపాయముంది. మనదేశంలో ఎక్కడా అలాంటి విధానం లేదు. సత్ప్రవర్తనతో మెలిగే ఖైదీలను పెరోల్‌, పర్లోపై కొద్దిరోజులు బయటకు వెళ్లే అవకాశం కల్పిస్తారు తప్ప భార్య కానీ మరెవరినైనా కానీ జైల్లో నేరుగా కలిసే అవకాశం ఖైదీలకు ఉండదు. ములాఖత్‌ ద్వారా కలిసినా అద్దాల తెర అవతల నుంచి.. అదీ ఫోన్‌లో మాత్రమే మాట్లాడుకునే అవకాశం కల్పిస్తారు. అలాంటిది ఏకంగా సంసార జీవితానికి అవకాశం ఇవ్వాలని వారు కోరడం జైళ్లశాఖ ఉన్నతాధికారుల్ని విస్మయపరిచింది. అలాగే ఖైదీలకు సరఫరా చేసే దుస్తులు మరీ వదులుగా లేకుండా చూడాలని కూడా విన్నవించారట ఆ ఖైదీలు!

ABOUT THE AUTHOR

...view details