తెలంగాణ

telangana

ETV Bharat / city

Ration cards: బోగస్ రేషన్​ కార్డుల ఏరివేతకు సిద్ధమైన పౌరసరఫరాల శాఖ

ఏపీలో బియ్యం కార్డుల వడపోత దిశగా పౌరసరఫరాల శాఖ.. చర్యలు ముమ్మరం చేసింది. ఇటీవల వరకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రేషన్‌ తీసుకుంటున్న వారిపై దృష్టి పెట్టిన అధికారులు.. ఇప్పుడు బోగస్‌ కార్డుల ఏరివేత చేపట్టారు. వరసగా మూడు నెలలకుపైగా రేషన్‌ తీసుకోని కార్డుల సంగతేంటో తేల్చాలని మండలాలకు జాబితాలను పంపారు. గ్రామాల వారీగా వీటి పరిశీలన మొదలైంది.

Ration cards
ఏపీలో బియ్యం కార్డుల వడపోత

By

Published : Sep 20, 2021, 7:12 PM IST

ఏపీలో మొత్తం 1.49 కోట్ల బియ్యం కార్డులు ఉన్నాయి. గతంలో రేషన్‌ కార్డులు అమలులో ఉండగా.. నవశకం కార్యక్రమంలో భాగంగా మళ్లీ సర్వే చేయించి అర్హులకు బియ్యం కార్డులు మంజూరు చేశారు. ఇలా బియ్యం కార్డు వచ్చినా.. కొందరు ఇప్పటి వరకు రేషన్‌ తీసుకోవడానికి రాలేదు. అందులోని కుటుంబ సభ్యుల్లో ఒక్కరు కూడా ఆధార్‌ ధ్రువీకరణ చేసుకోలేదు. ఇలాంటి కార్డులు మండలానికి 800 నుంచి 1000 పైగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఏడు లక్షలకుపైగా ఉన్నట్లు అంచనా.

అసలు గ్రామంలోనే ఉన్నారా?

బియ్యం కార్డు తీసుకున్న వారు పేదలైతే వారికి బియ్యం అవసరం ఉంటుంది. నెలనెలా రేషన్‌ తీసుకుంటారు. కొన్ని నెలలపాటు తీసుకోవడానికి రావడం లేదంటే.. కార్డులు బోగస్‌వేమోనని పౌరససరఫరాల శాఖ అనుమానిస్తోంది. ఇలాంటి వారు.. నిజంగా గ్రామంలోనే ఉన్నారా? ఉంటే బియ్యానికి ఎందుకు రావడం లేదు? అవసరం లేదా? వలస వెళ్లారా? అని పరిశీలిస్తోంది. అనర్హులని తేలితే.. వారి కార్డుల్ని బ్లాక్‌ చేస్తారు. సంబంధిత కార్డుదారులు నిజంగా తాము అర్హులమని భావిస్తే.. తగిన ఆధారాలు చూపి పునరుద్ధరించుకునే వెసులుబాటు ఇస్తున్నారు. అయితే పలు ప్రాంతాల్లో పేద కుటుంబాలు నెలల తరబడి వలసలోనే ఉంటాయి. ఆరు నెలలు, ఏడాదికోసారి వస్తుంటారు. అలాంటి వారి కార్డుల్ని తొలగిస్తే.. అర్హులకే అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం గ్రామాల్లో పలువురి నుంచి విన్పిస్తోంది.

అంతా ‘హడావుడి’గా చేసేశారు

‘నవశకం’లో కొత్త బియ్యం కార్డుల జారీ సందర్భంగా.. కొందరు హడావుడిగా పాత రేషన్‌ కార్డులనే సిఫారసు చేయడంతోపాటు సరిగా వివరాలు కూడా నమోదు చేయలేదని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. అప్పట్లో కొందరు కార్డుదారులు చనిపోయారని.. ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దీంతో బియ్యం కార్డులు ఇవ్వలేదు. చనిపోయినట్లు పేర్కొన్న వ్యక్తులే.. ఇప్పుడు కొత్త కార్డులకు దరఖాస్తు చేయడంతో అధికారుల సైతం విస్తుపోయారు. విచారణ చేస్తే వారు బతికి ఉన్నట్లు తేలింది. దీంతో కొత్త కార్డులు మంజూరు చేస్తున్నారు.
* బియ్యం కార్డులకు ఆధార్‌ వివరాలు సరి చూస్తున్న సమయంలో.. ఇప్పటికీ కొన్ని నకిలీ ఆధార్‌లు ఉన్నట్లు గుర్తించారు. సుమారు 350 వరకు బయటపడ్డాయి. రేషన్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధాన సమయంలో.. ఏదో అందుబాటులో ఉన్న ఆధార్‌తో మమ అన్పించారు. ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయి.

అర్హులు దరఖాస్తు చేసుకుంటే వెంటనే కార్డు ఇస్తాం
‘అనర్హుల్ని గుర్తించి.. వారి కార్డుల్ని బ్లాక్‌ చేస్తాం. తాము నిజంగా అర్హులని భావిస్తే ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. వెంటనే కొత్త కార్డులు మంజూరు చేస్తాం’ అని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ తెలిపారు. బియ్యం కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, సమాచార నవీకరణలో భాగంగా ఎప్పటికప్పుడు అనర్హుల్ని తొలగించే కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

ఇదీ చూడండి:KTR AND REVANTH TWITTER WAR: టాలీవుడ్​ డ్రగ్స్​ కేసు టు వైట్​ ఛాలెంజ్​ వయా ట్విటర్​ వార్​

ABOUT THE AUTHOR

...view details