దేశ ప్రజల్లో ఓబీసీ కమిషన్ భరోసా నింపిందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. ఓబీసీ కమిషన్ ఆశాజనకంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్టు.. ఆశాభావం వ్యక్తం చేశారు. వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీసీ జాతీయ కమిషన్ ఛైర్మన్ భగవాన్లాల్ సహానీతో కలిసి పాల్గొని ప్రసంగించారు. తెలుగులో ప్రసంగించి తమిళిసై అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆశాజనకంగా ముందుకు వెళ్లాలి...
"ఈ రోజుతో ఓబీసీ కమిషన్ రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ రెండేళ్లలో ఎన్నో సంవత్సరాల పనిని పూర్తిచేసింది. ఈ ఓబీసీ కమిషన్ అనేది ప్రజల్లో ధైర్యం, భరోసాతో పాటు ఆశలు నింపింది. ఈ కమిషన్ భవిష్యత్తులో మరింత ఫలప్రదంగా, ఆశాజనకంగా, శక్తివంతంగా, విజయవంతంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా. ఈ ఓబీసీ కమిషన్‌ను మనందరి కోసం రాజ్యాంగబద్ధం చేసిన ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు." - తమిళిసై, గవర్నర్
గొర్లు, బర్ల పంపిణీతో కాదు..
బీసీలు విద్యతోనే సమాజంలో గౌరవం పొందుతారని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా.. విద్యతోనే సమాజం అభివృద్ధి బాట పడుతుందని దత్తాత్రేయ స్పష్టం చేశారు.
"27 శాతం రిజర్వేషన్లతో బీసీలు మరింత బలపడతారు. విద్యతోనే సమాజంలో బీసీలకు గౌరవం దక్కుతుంది. సంక్షేమ పథకాల కింద పశువులు పంపిణీ చేస్తున్నారు. గొర్లు, బర్లు పంపిణీతో కాదు విద్యతోనే బీసీల అభివృద్ధి జరుగుతుంది. బీసీ కమిషన్‌కు గతంలో మాదిరి అధికారాలు లేవు. బీసీ కమిషన్‌కు ప్రధాని మోదీ చట్టబద్ధత కల్పించారు." - బండారు దత్తాత్రేయ, హరియాణా గవర్నర్