Street Dogs Problem in Hyderabad: హైదరాబాద్‌లోని పలు కాలనీల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. రోడ్డుపై ఆడుకుంటున్న పిల్లలను, బడికి వెళ్లివస్తున్న విద్యార్థులపై దాడులు చేస్తున్నాయి. అమీర్‌పేట్ ధరమ్‌కరమ్ రోడ్డులో ఓ పిచ్చి కుక్క చేసిన దాడిలో పదుల సంఖ్యలో విద్యార్థులకు గాయాలయ్యాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా శునకాలు జనాలపైకి ఎగబడుతున్నాయి. చారిత్రక ప్రాంతం చార్మినార్‌లో కుక్కల బెడద అధికంగా ఉంది. దేశవిదేశీ పర్యాటకులు వచ్చే చోటా నిర్లక్ష్యం తాండవిస్తోంది. రైన్ బజార్ ప్రాంతంలో కొద్ది రోజుల కిందట మహిళపై కుక్కలు దాడి చేశాయి. ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది.
ముషీరాబాద్, రాంనగర్, విద్యానగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, గాంధీనగర్ ప్రాంతాల్లో వీధి కుక్కల సంచారం అధికంగా ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీ వాసులు వాపోతున్నారు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో శునకాల సంఖ్య అధికంగా ఉంది. అల్పాహార కేంద్రాలు, చికెన్ సెంటర్ల వద్ద ఆహారం కోసం కాపలా కాస్తూ.. ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటూ ప్రజల మీదికి వస్తున్నాయి. వసతిగృహాల వద్ద కూడా వీధి కుక్కలు అధికంగా తర్చాడుతున్నాయి. కొద్ది రోజుల కిందట హైదర్‌నగర్ శ్రీనివాసకాలనీ 5ఏళ్ల బాలుడు దుకాణానికి వెళ్లివస్తున్న సమయంలో దాడి చేయగా.. ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోజురోజుకు కుక్కల బెడద పెరిగిపోతోంది.
ఎల్బీనగర్ నియోజకవర్గ పరధిలోని మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో సౌత్ ఎండ్ పార్క్, డంపింగ్ యార్డ్ సమీపంలో.. ఆటోనగర్ పరిసప్రాంతాల్లో శునకాలు సంచరిస్తున్నాయి. వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్, సామానగర్.. నాగోల్‌లోని జైపూర్ కాలనీ, ఫత్తులగూడాలో శునకాల బెదడ అధికంగా ఉంది. ఫత్తుల గూడలో ఉన్న యానిమల్ కేర్ సెంటర్‌కి తెచ్చిన శునకాలను... శస్త్ర చికిత్సలు చేసి అక్కడే వదిలిపెడుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో శునకాలు విపరీతంగా సంచరిస్తున్నాయి.