Hyd Metro : హైదరాబాద్ మెట్రోకు పూర్వవైభవం ఎప్పుడో? - corona effect on Hyderabad metro
కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల ప్రజారవాణాలో చాలా మార్పులొచ్చాయి. అటు ఆర్టీసీ, ఇటు మెట్రో(Hyd Metro) సంస్థలు కుదేలైపోయాయి. కరోనాకు ముందు హైదరాబాద్ మెట్రో(Hyd Metro)లో వార్షికంగా దాదాపు 10 కోట్ల మంది ప్రయాణిస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 2 కోట్లకు పడిపోయింది.
హైదరాబాద్ మెట్రో
By
Published : Jul 12, 2021, 6:58 AM IST
భాగ్యనగర ప్రజారవాణా మెట్రో(Hyd Metro)కి ముందు తర్వాత అన్నట్లుగా.. మెట్రో ప్రయాణం కొవిడ్‌కు ముందు తర్వాతగా చెప్పుకోవాల్సి వస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు మెట్రో(Hyd Metro)లో వార్షికంగా 10.16 కోట్ల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే.. తర్వాత ఏడాదిలో 2.34 కోట్లకు పడిపోయింది. కొవిడ్ భయంతో అధికులు ఇంటికే పరిమితం కావడం, సొంతవాహనాల్లో వెళ్లేందుకు మొగ్గుచూపడం ప్రభావం చూపింది. వారిని తిరిగి ఆకర్షించేందుకు అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.
69.2 కి.మీ. మేర అందుబాటులోకి...
హైదరాబాద్ మెట్రో(Hyd Metro) ప్రస్తుతం 69.2 కి.మీ. మేర అందుబాటులోకి వచ్చింది. మూడు కారిడార్లలో రైళ్లు తిరుగుతున్నాయి. మెట్రో(Hyd Metro) వరకు చేరుకునేందుకు, మెట్రో దిగిన తర్వాత గమ్యస్థానం చేరేందుకు రవాణా అనుసంధానం లేకపోవడం పెద్ద సమస్యగా ఉంది. ఇటీవల ఉమ్టా(యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ) ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ సంస్థ చేసే సూచనలు ఆచరణలో పెడితే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.
2017-18 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సర ముగింపు నాటికి లాక్‌డౌన్ ఐదు నెలలు మినహాయిస్తే 18.34 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఎల్‌అండ్‌టీకి రూ.1500 కోట్ల ఆదాయం వచ్చింది. అద్దెలు, ప్రకటన రూపంలో రూ.300 కోట్ల వచ్చిందని చెబుతున్నారు.
2017-18 వార్షిక సంవత్సరంలో 94 లక్షల మంది ప్రయాణికులు మెట్రో(Hyd Metro)లో ప్రయాణించారు. 2018-19కి ఆ సంఖ్య నాలుగు రెట్లయింది. ఆ ఏడాదిలో 4.90 కోట్ల మంది ప్రయాణికులు మెట్రోను వినియోగించుకున్నారు. 2019-20లో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య అధికమయింది. ఈ ఒక్క ఏడాదిలో 10.16 కోట్ల మంది మెట్రోలో ప్రయాణించారు.
కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల ప్రజలు దాదాపుగా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం ఉంటే తప్ప బయట తిరగడానికి ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల ప్రజా రవాణా ఉపయోగించుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ముఖ్యంగా ఆర్టీసీ, మెట్రో(Hyd Metro)లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.
లాక్‌డౌన్ సడలింపు తర్వాత క్రమంగా ప్రజలు.. కార్యాలయాలకు వెళ్లడం మొదలుపెట్టారు. అయినా.. రవాణా వ్యవస్థ పుంజుకోలేకపోయింది. కారణం.. ఎక్కువ మంది సొంత వాహనాల్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపడం. లేదా.. ఇంటి నుంచే పని చేయడం.