తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పలువురు ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి వేళ ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఆయన విగ్రహానికి నివాళులర్పించడం, అన్నదాన కార్యక్రమం, రక్తదాన శిబిరాలు, పలు సేవాకార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రక్తదాన కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవినేని ఉమామహేశ్వరావు సహా పలువురు సినీ తారలు పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ సేవలు మరువలేనివి..
ఆడపిల్లలకు ఆస్తి హక్కు వంటి ఎన్నో గొప్ప సంస్కరణలను ఎన్టీఆర్ తీసుకొచ్చారని తెదేపా నేతలు కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని ఇచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. దేశంలోనే అత్యుత్తమంగా సంక్షేమ పథకాలకు పునాది వేసి 2 రూపాయలకు కిలో బియ్యం, పేదవాడికి పక్కా గృహం అందించిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలిపారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి వారి అధీనంలో మగ్గిన బడుగులకు నిజమైన స్వాతంత్య్రాన్ని అందించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం తెలుగు దేశం పార్టీ ఎప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అరాచక పాలనపై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ 25వ వర్ధంతి... స్మరించుకోనున్న నేతలు ఇదీ చదవండి:రాముడు, కృష్ణుడు.. ఏ పాత్ర అయినా గుర్తొచ్చేది ఆయనే