తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆదాయ, వ్యయాలపై త్వరలో పైలట్​ సర్వే: ఎన్‌ఎస్‌ఎస్‌ఓ డీజీ - NSSO DG PETER JHANSON meeting on survey

దేశవ్యాప్తంగా కుటుంబాల ఆదాయం, వ్యయం, పొదుపు, పెట్టుబడులపై త్వరలో పైలట్ సర్వే జరుగుతుందని జాతీయ నమూనా సర్వే కార్యాలయం( ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) డైరెక్టర్ జనరల్ పీటర్ జాన్సన్ తెలిపారు. పంటల అంచనాలు, కోతలు, దిగుబడులపై సర్వే జరుగుతోందని.. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అడిగితే రైతుల ఆత్మహత్యలపైనా సర్వే చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

nsso dg
ఆదాయ, వ్యయాలపై ఫిబ్రవరి నుంచి పైలట్​ సర్వే: ఎన్‌ఎస్‌ఎస్‌ఓ డీజీ

By

Published : Feb 26, 2021, 7:57 PM IST

దేశంలో అసంఖ్యాకంగా ఉన్న అసంఘటిత ఔత్సాహిక పారిశ్రామిక రంగం, ఆవర్తన శ్రమశక్తిపై సర్వే చేపట్టబోతున్నామని జాతీయ నమూనా సర్వే కార్యాలయం(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) డైరెక్టర్ జనరల్ ఎం.పీటర్ జాన్సన్ వెల్లడించారు. గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సర్వే జరగనుందన్నారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని జాతీయ గణాంక ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎన్‌ఎస్ఎస్‌ఓ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ డి.సతీశ్​, అసిస్టెంట్ డైరెక్టర్ విజయసారథి, సీనియర్ గణాంక అధికారులు దేశబోయిన భరత్‌రాజ్‌, బర్కత్ అలీ, జయరామ్, జూనియర్ గణాంక అధికారులు, క్షేత్ర సహాయకులు, క్షేత్ర పరిశోధకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

కేంద్ర మంత్రిత్వ శాఖల అవసరాల మేరకు ఏటా జరిగే సర్వేల్లో భాగంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎదుర్కొంటున్న సాధక బాధకాలపై చర్చించారు. సర్వేల సమయంలో అపోహలు పడుతూ కొందరు సరైన సమాచారం ఇవ్వకుండా.. కొన్నిసార్లు సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

దేశవ్యాప్తంగా కుటుంబాల ఆదాయం, వ్యయం, పొదుపు, పెట్టుబడులపై త్వరలో పైలట్ సర్వే జరుగుతుందని పీటర్ జాన్సన్ తెలిపారు. త్వరలో 79వ రౌండ్‌లో గిరిజనుల స్థితిగతులు, ఆయూష్‌, రైల్వే, ఆరోగ్యం, బాలికల సంరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలపైనా సర్వే చేపడతామని చెప్పారు.

వ్యవసాయం సంబంధించి పంటల అంచనాలు, కోతలు, దిగుబడులపై సర్వే సాగుతున్న దృష్ట్యా.. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అడిగితే రైతుల ఆత్మహత్యలపైనా సర్వే చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

ఆదాయ, వ్యయాలపై త్వరలో పైలట్​ సర్వే: ఎన్‌ఎస్‌ఎస్‌ఓ డీజీ

ఇవీచూడండి :ఒక్కరోజే రూ.2000 తగ్గిన కిలో వెండి ధర

ABOUT THE AUTHOR

...view details