తెలంగాణ

telangana

ETV Bharat / city

‘గ్రేటర్‌’ ఎన్నికల వేళ... హైదరాబాద్​పై ఎన్నారైల అభిప్రాయాలు - nris opinion on hyderabad development

భాగ్యనగరం ఇప్పుడు విశ్వనగరంగా మారే క్రమంలో వడివడిగా అడుగులు వేస్తోంది. ఐటీ విస్తరణతో నగరానికి ఎన్నో కొత్త హంగులు సమకూరగా.. ఇప్పుడు పలు రకాల మౌలిక వసతులు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నగర ముఖచిత్రమే మారిపోయింది. బల్దియా ఎన్నికల వేళ పలువురు ప్రవాసీ హైదరాబాదీలు తమ అభిప్రాయాల్ని ఈటీవీ భారత్​తో పంచుకున్నారు. విదేశాల్లో స్థానిక సంస్థల పాలన, విధాన నిర్ణయాల్లో పౌరుల భాగస్వామ్యం, ఎన్నికల తీరు, హైదరాబాద్‌ భవిష్యత్తు గురించి వివరించారిలా...

nris opinion on ghmc elections
nris opinion on ghmc elections

By

Published : Nov 22, 2020, 7:36 AM IST

భవిష్యత్తు కోసం వ్యూహాత్మక ప్రణాళికలు

"దేశ వ్యాప్తంగా ఇతర మెట్రో నగరాలకంటే హైదరాబాద్‌ ముందంజలో ఉంది. గత ఐదేళ్లలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యువతకు ప్రోత్సాహకంగా ఐటీ హబ్‌, అంకుర సంస్థలకు ఇంక్యుబేటర్‌ కేంద్రాల ఏర్పాటు మంచి నిర్ణయం. గతంలో వైద్యం అనేది ప్రధాన సమస్యగా ఉండేది. దానికి బస్తీ దవాఖానాలు పరిష్కారమిచ్చాయి. వాటిని సక్రమంగా నిర్వహిస్తే జనం బాధలు తీరినట్లే. భద్రతలోనూ వ్యూహాత్మక ప్రణాళికల్ని రూపొందిస్తున్నారు." - శ్రీనివాస్‌ ముంజాల, అబుదాబి, యఏఈ

స్థానిక సంస్థలకే పూర్తి అధికారం

"ప్రస్తుతం డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హగెన్‌లో ఐటీ ఉద్యోగి, వ్యాపారవేత్తగా స్థిరపడ్ఢా ఇక్కడి నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయి. అంతర్జాతీయ స్థాయి సంస్థలు నగరంవైపు చూస్తున్నాయి. డెన్మార్క్‌ దేశ జనాభా దాదాపు 60మిలియన్లు. మన నగరాల్లో స్థానిక సంస్థల్లాగా ఇక్కడ 60వేల మందికి ఓ ‘కవ్యన్‌’ ఉంటుంది. ఆ ప్రాంత అభివృద్ధిలో పూర్తి అధికారాలు కవ్యన్‌కి పాలకులుగా ఉండే బోర్‌గమిస్టర్‌కే ఉంటుంది. విధాన పరమైన నిర్ణయాల్లో పౌరుల భాగస్వామ్యం ఉంటుంది. పారిశుద్ధ్యం, విద్య, వైద్యం ఇలా పౌరులకు కావాల్సిన ప్రతీదాన్ని హక్కుగా పొందే వీలుంది." - సామ సతీశ్‌రెడ్డి, కోపెన్‌హగెన్‌, డెన్మార్క్‌

ఐటీలో హైదరాబాదే మేటి..

"జర్మనీలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నా. అక్కడి నగరాలు, దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోనే ఐటీ అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. జర్మనీలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పనిచేసే ఉద్యోగులకు సరైన వాతావరణం ఉండదనే భావన వస్తోంది. కానీ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐటీహబ్‌, స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ సెంటర్లు కీలకం కానున్నాయి. సొంతంగా ఎదగాలనుకునేవారికి వేదికలుగా నిలుస్తున్నాయి." - రాజన్‌ గంగపుత్ర, జర్మనీ

ఆస్ట్రేలియాలో ఇలా.. బల్దియాలోనూ ఆచరిస్తే పోలా!

స్థానికంగా ప్రభుత్వ సేవల కోసం తీవ్ర పోటీ

లింగభేదం లేకుండా ఉపాధి అవకాశాలు

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అవయవాల పనితీరు బాగుండాలి. అప్పుడే రోజువారీ పనుల్లో చరుగ్గా రాణించగల్గుతాడు. వాటిల్లో ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకున్నా.. ఆ ప్రభావం అతడి మనుగడపై పడుతుంది. అలాగే మున్సిపల్‌ వ్యవస్థ సమర్థంగా పనిచేయాలంటే వివిధ విభాగాల పనితనం మెరుగ్గా ఉండాలి. నిధులు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు, రహదారులు.. తదితర విభాగాలన్నీ సమన్వయంతో ముందుకు సాగితే నగరాల్లో అభివృద్ధి బాగుంటుంది. ఇలా అన్నిరకాల విభాగాల్లో పౌరులకు మంచి సేవలు అందిస్తోన్న మున్సిపల్‌ వ్యవస్థలు విదేశాల్లో చాలా ఉన్నాయి. వాటి పనితీరు గురించి కొందరు ఆస్ట్రేలియా ప్రవాసుల అభిప్రాయాలు ఇవి..

స్త్రీ, పురుష భేదం ఉండదు: మార్టూరు స్వాతి

విద్యుత్తు, తాగునీటి సరఫరాలో ఆటంకాలు ఉండవు. ఇంటి నుంచి బయటకు వెళ్తే స్త్రీ, పురుషుల భేదం ఏ మాత్రం ఉండదు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమైతారు. నిత్యావసరాల ధరలు మాత్రం అధికంగా ఉంటాయి. పాఠశాలల్లో విద్యార్థులకు స్వేచ్ఛ ఎక్కువ. ప్రజా మరుగుదొడ్లు సైతం చాలా పరిశుభ్రంగా ఉంటాయి.

ప్రభుత్వ సంస్థలకే ప్రాధాన్యం: వూరె నారాయణ

మున్సిపల్‌ పాలన, ప్రజాసంక్షేమం విభాగాల్లో ఆస్ట్రేలియాలో చక్కటి విధానాలు అమలులో ఉన్నాయి. ప్రభుత్వ సంస్థల నుంచి సేవలు పొందేందుకు స్థానికులు ఉవ్విళ్లూరుతుంటారు. పిల్లల చదువు, వైద్యసేవలు పొందేందుకు ప్రభుత్వ సంస్థల వైపే మొగ్గు చూపుతారు. ముఖ్యంగా సర్కారు విద్యా సంస్థల్లో ప్రవేశాలకు పోటీ అధికంగా ఉంటుంది. రోడ్లను పదే పదే తవ్వాల్సిన అసవరం రాదు. రహదారులపై అడుగడుగునా టోల్‌గేట్ల ఏర్పాటుతో ఎక్కువమంది ప్రజారవాణా వ్యవస్థను ఆశ్రయిస్తారు. దీంతో ట్రాఫిక్‌ సమస్యలు, శబ్ద, వాయు కాలుష్యం తక్కువగా ఉంటాయి.

ఇదీ చూడండి: జీహెచ్‌ఎంసీగా హైదరాబాద్‌ ఎలా మారిందో తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details