తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్ ప్రత్యేకం: పొట్ట నింపుతున్న ఉపాధి హామీ పనులు - మహబూబ్​నగర్​లో ఉపాధి హామీ పనులు

చేద్దామంటే పనుల్లేవు. పని చేయకుంటే పూట గడవదు.. అలాంటి వాళ్లకు ఉపాధి హామీ పథకం వరంగా మారింది. ఉద్యోగి నుంచి దినసరి కూలీ వరకు పొట్టకూటి కోసం పనులకు వెళ్తున్నారు. పల్లె జనాల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

nrega
ఉపాధి హామీ పనులు

By

Published : May 15, 2020, 10:09 AM IST

Updated : May 15, 2020, 10:40 AM IST

పొట్ట నింపుతున్న ఉపాధి హామీ పనులు

లాక్‌డౌన్‌ వేళ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉపాధి పనులు ఊపందుకున్నాయి. పొట్టకూటి కోసం పెద్ద ఎత్తున పనుల్లో చేరుతున్నారు. ఉద్యోగి నుంచి దినసరి కూలీ వరకూ.... విద్యావంతుల నుంచి నిరక్ష్యరాస్యుల వరకూ ఉపాధి హామీ పనుల బాట పడుతున్నారు. లాక్‌డౌన్‌ వేళ 2నెలలుగా ఎక్కడా పనుల్లేవు. జేబుల్లో డబ్బుల్లేవు. కూర్చుని తింటే ఇల్లు గడవదు. అందుకే చేసే వృత్తులు వదిలి ఉపాధి హామీ పనులబాట పడుతున్నారు.

అనంతపురంలో ప్రైవేటు సర్వేయర్​గా పనిచేసేవాడిని. రూ.20 వేలు జీతం వచ్చేది. లాక్​డౌన్​లో సొంతూరుకొచ్చా. ఏ పని దొరకడం లేదని ఉపాధి పనుల్లో చేరా. 18 ఏళ్లప్పుడే జాబ్ కార్డు పొందా. ఇప్పుడు రోజూ 230 వరకూ సంపాదిస్తున్నా. ఇబ్బందిగానే ఉన్నా బతకాలంటే తప్పదు మరి. - అంజనేయులు, సల్లోనిపల్లి

పాలమూరులో ప్రైవేటు కళాశాలలో ఫాకల్టీగా పనిచేసేవాడిని. రూ.10 వేలిచ్చేవారు. లాక్ డౌన్ లో విద్యాసంస్థలు మూసేశారు. జీతాలు లేవు. దీంతో ఉపాధి పనిలో చేరా. రోజుకు 200 వస్తున్నాయి. అసలే పనులు దొరకని కాలంలో నాలాంటి వాళ్లని ఎంతోమందికి 100 రోజుల పని ఉపాధి చూపుతోంది. - హనుమంతు, సల్లోనిపల్లి

పనే వారికి పెద్ద దిక్కైంది..

లాక్‌డౌన్‌ కారణంగా ఇల్లు కదలలేని పరిస్థితి నెలకొంది. ఉపాధిహామీ పనులకు ప్రభుత్వం గ్రామాల్లో అనుమతులిచ్చింది. అందువల్ల వేరే ప్రాంతాలకు పనుల కోసం వెళ్లేవారు సైతం గత్యంతరం లేక... ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. ఆటో డ్రైవర్లు, ఎలక్ట్రిషియన్లు, మెకానిక్‌లు ఎంతోమంది ఉపాధి పనుల్లో కనిపిస్తున్నారు. వాస్తవానికి వాళ్లు చేసే పనికంటే ఉపాధి పనులు చేస్తే వచ్చే దినసరి కూలీ చాలా తక్కువ. కానీ అసలే పనుల్లేని సమయంలో... ఉపాధి పనే వారికి పెద్ద దిక్కైంది.

పాలమూరులో హమాలీ పనిచేసేవాణ్ని. రోజూ రూ.400 నుంచి రూ.450 దొరికేవి. ఇప్పుడన్నీ బంద్ కదా.. అందుకే 100 రోజుల పని చేస్తున్నా. అసలే పనులు లేని కాలంలో రూ. 200 వచ్చినా... ఉపాధి పని నయమే కదా సారు. - లక్ష్మయ్య, సల్లోనిపల్లి

నేను మేస్త్రీ పని చేస్తా. రోజూ రూ.550 లిచ్చేవాళ్లు. రెండు నెలలాయే పనులు దొరకడం లేదు. పనిచేస్తే తప్ప తినలేం. అందుకే ఉపాధి పనికొచ్చా. భార్య, నాకు కలిపి ఇప్పుడు రూ. 450 వరకూ వస్తోంది. దినసరి కూలీ చేసేవాళ్లకి రోజుకు రూ.200 వచ్చినా నయమేసారు.- కేశవులు, సల్లోనిపల్లి

54వేల మంది..

సాధారణంగా వేసవిలో సల్లోనిపల్లిలో వంద నుంచి 150 కంటే ఎక్కువ కూలీలు కనిపించరు. కానీ ఈ వారం సల్లోనిపల్లిలో గరిష్ఠంగా 646 మంది పనిచేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 9వేల మంది పనిచేస్తే... ప్రస్తుతం 54వేల మంది పనిచేస్తున్నారు. ఉపాధిహమీ పథకం నిరుపేద కుటుంబాలకు ఎలా ఉపయోగపడుతుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్, మహబూబ్ నగర్ సహా ఇతర పట్టణాల్లో పనిచేసే వాళ్లంతా ప్రస్తుతం ఉపాధి పనికి వెళ్తున్నారు. ఆటోడ్రైవర్లు, ఎలక్ట్రిషియన్లు, మెకానిక్​లు, కూరగాయలు అమ్మేవాళ్లు ఇలా చాలామంది ఉపాధికి వస్తున్నారు. 75మందికి కొత్తగా జాబ్ కార్డులు కూడా ఇచ్చాం. కొంతమంది 100 రోజులు కూడా పూర్తైంది. - లక్ష్మీనారాయణ, సర్పంచ్, సల్లోనిపల్లి

ఈసారి కొత్తగా 300 నుంచి 400 మంది అధికంగా పనిచేస్తున్నారు. ఇంకొన్ని దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయి. పట్నాలకు వలసవెళ్లి పనిచేసే వాళ్లకు ప్రస్తుతం పల్లెల్లో ఉపాధి హామీ పని దారి చూపుతోంది. పనుల్లేక, జీతాల్లేక ఇంట్లో ఉండిపోయిన వాళ్లు 100 రోజుల పనికి వస్తున్నారు. - జ్ఞానేశ్వర్, పంచాయతీ కార్యదర్శి, సల్లోనిపల్లి

పొడిగించాలని డిమాండ్..

జాబ్‌కార్డులు ఉండి ఇప్పటివరకూ ఎన్​.ఆర్.​ఈ.జీ.ఏ పనులు ఉపయోగించుకోని వాళ్లు కూడా ప్రస్తుతం 100 రోజుల పనికి వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల 24వేల మంది ఉపాధి పనులకు వెళ్తుండగా... అందులో 2 లక్షల 74వేల మంది కొత్తగా పనుల్లో చేరినవాళ్లే. 100 రోజుల పని కల్పించాలంటూ... రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది జాబ్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. సొంతూళ్లకు వచ్చిన ఉపాధి లేని వాళ్లంతా ప్రస్తుతం జాబ్ కార్డు కావాలని, పని కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే 100 రోజుల పనులు పూర్తైన వాళ్లు సైతం.. చేసేందుకు పనుల్లేవని పని దినాలు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చూడండి:తడిసిన నయనం.. ఆగని పయనం

Last Updated : May 15, 2020, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details