కరోనా దృష్ట్యా గత మార్చ్‌లో వాయిదా పడిన ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ.. ఎట్టకేలకు తిరిగి ప్రారంభం కాబోతుంది. ఏపీ ఎస్ఈసీ, ప్రభుత్వం వాదోపవాదాలతో వాయిదా పడుతూ వస్తున్న పల్లె పోరుకు నేటి నుంచి తెరలేవనుంది. పంచాయతీ ఎన్నికలకు గతేడాది మార్చి 15న నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా... కరోనా వ్యాప్తి వల్ల వాయిదా వేస్తున్నట్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రకటించారు. అప్పుడు నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించగా... ఇప్పుడూ ఆ విధంగానే చేపట్టనున్నారు. ఇప్పటికే షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేయగా.... ఇవాళ ఉదయం 10 గంటలకు తొలి దఫా పంచాయతీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ కానుంది.
ఈ నెల 25నుంచి నామినేషన్ల స్వీకరణ
తొలి దశ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 25 నుంచి 3 రోజుల పాటు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు 27వ తేదీ వరకూ గడువు ఉండగా.. 28న వాటిని పరిశీలించనున్నారు. ఉపసంహరణకు జనవరి 31 మధ్యాహ్నం 3 గంటల వరకూ అవకాశముండగా... ఆ తర్వాత అదే రోజున తుది జాబితాను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి ఐదో తేదీన ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తారు. ఫలితాలు వెల్లడించిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు.