CM Convoy Case Updates : ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం కాన్వాయ్కి ప్రయాణికుల కారును స్వాధీనం చేసుకున్న ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. విచారణ అధికారిగా ఒంగోలు ఆర్డీవోను ప్రభుత్వం నియమించింది. శనివారం రోజున విచారణకు హాజరుకావాలని సంబంధిత వ్యక్తులకు ఆర్డీవో.. విడివిడిగా నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు కారులోని ప్రయాణికులు, డ్రైవర్, యజమాని, ఆర్టీవో అధికారులు.. విచారణ నిమిత్తం ఒంగోలు ఆర్డీవో కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే:పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఫ్లెక్సీ వ్యాపారి వేముల శ్రీనివాస్ కుటుంబసభ్యులతో తిరుపతి బయలుదేరారు. ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని తిరుపతి పయనమయ్యారు. మార్గ మధ్యలో అల్పాహారం కోసం ఒంగోలులోని కర్నూలు రోడ్డు వద్ద ఆగారు. అంతలో.. అక్కడికి వచ్చిన ఓ రవాణాశాఖాధికారి దౌర్జన్యకాండకు తెరతీశారు. శుక్రవారం సీఎం జగన్ పర్యటన ఉందని పోలీస్ కాన్వాయ్ కోసం ఇన్నోవా కారు కావాలని చెప్పారు. కారులో ఉన్న లగేజీ మొత్తం తీసుకోవాలని ఆదేశించారు.
CM Convoy Case in AP : ఆర్టీఏ అధికారుల తీరుతో వేముల శ్రీనివాస్ కుంటుంబం.. అవాక్కైంది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నడిరోడ్డుపై కారు వదిలేసి దిగిపోమంటే ఎలా అని ప్రశ్నించారు. చిన్న పిల్లలు ఉన్నారని వేడుకున్నా ఆర్టీఏ అధికారులు ఒప్పుకోలేదు. బలవంతంగా కారును తీసుకెళ్లిపోయారు. ఆర్టీఏ అధికారుల తీరుతో వేముల శ్రీను కుటుంబ సభ్యులు..ఒంగోలులో నడిరోడ్డుపైనే ఆగిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వాహనంలో తిరుమల చేరుకున్న వేముల శ్రీనివాస్ కుటుంబం.. ఆర్టీఏ అధికారుల తీరుపై మండిపడ్డారు.
అద్దెకు తెచ్చుకున్న ఇన్నోవా కారును బలవంతంగా తీసుకెళ్లిపోయారని.. ఏం జరుగుతుందో తెలియక.. రాత్రివేళ తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఈటీవీ భారత్ కథనం ప్రచురించింది. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫలితంగా సీఎంవో స్పందించింది. ఈ విషయంపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ఆర్టీఏ సిబ్బంది ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు పూర్తిస్థాయి విచారణ ప్రారంభించారు.
సంబంధిత కథనాలు :