తెలంగాణ

telangana

By

Published : Jul 27, 2021, 6:15 PM IST

Updated : Jul 27, 2021, 10:29 PM IST

ETV Bharat / city

GANDHI HOSPITAL: ఆగస్టు 3 నుంచి గాంధీ ఆస్పత్రిలో నాన్‌ కొవిడ్‌ సేవలు

Gandhi hospital
Gandhi hospital

18:13 July 27

ఆగస్టు 3 నుంచి గాంధీ ఆస్పత్రిలో నాన్‌ కొవిడ్‌ సేవలు

పేదల పెద్దాస్పత్రి గాంధీలో మూడున్నర నెలల తర్వాత సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొవిడ్ సెకండ్​ వేవ్​లో కరోనా కేసుల ఉద్ధృతి పెరగటంతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో కొవిడ్ నోడల్ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొవిడ్ రోగులతో పాటు... కరోనా ఉండి బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారికి సైతం గాంధీలో సేవలు అందిస్తున్నారు.

అయితే ఇటీవల కరోనా కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల తిరిగి గాంధీలో సాధారణ వైద్య సేవలు ప్రారంభించాలన్న డిమాండ్ పెరిగింది. సీజనల్ వ్యాధులు పెరగటం, యాక్సిడెంట్ కేసులు వెరసి ఉస్మానియా ఆస్పత్రిపైనా భారం పెరిగింది. ఫలితంగా సాధారణ రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక గాంధీలో పనిచేస్తున్న పీజీ వైద్య విద్యార్థులు సైతం తమకు గత ఏడాదిన్నరగా కొవిడ్ సేవలు మినహా ఇతర రోగులకు చికిత్స అందించే భాగ్యం కలగలేదని ఫలితంగా తమ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీలో ఆగస్టు 3 నుంచి తిరిగి సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. 

ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 380 వరకు కొవిడ్ కేసులకు చికిత్స అందిస్తున్నారు. మరో 80 వరకు బ్లాక్ ఫంగస్ బాధితులు ఉన్నారు. ఇక రోజుకి కేవలం 25 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవుతుండగా... వైరస్​తో ఆస్పత్రిలో చేరుతున్న వారు మాత్రం 40 మందికి పైగానే ఉంటున్నారు. గత నెల రోజులుగా ఇదే పరిస్థితి. కేసులు 300ల కంటే తగ్గితే సాధారణ వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ భావించినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవటం... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 400 దిగువకు రాకపోతుండటంతో ఆరోగ్య శాఖ ఈ మేరకు నిర్ణయించింది.  

గతేడాది సైతం దాదాపు మూడు నెలలపాటు గాంధీలో కొవిడ్ సేవలు మాత్రమే అందించారు. ఇక ఆగస్టు 3 నుంచి 450 పడకలు కొవిడ్ రోగులకు కేటాయించి మిగతా 1,200 పడకలను నాన్ కొవిడ్ బాధితులకు కేటాయించనున్నారు. ఎమర్జెన్సీ విభాగంలోనూ కొవిడ్ రోగులకోసం 350, నాన్ కొవిడ్ కోసం 250  పడకలను అందుబాటులో ఉంచనున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

గతేడాది మార్చి 24 నుంచి నవంబర్ వరకు కేవలం కొవిడ్ కేసులకు మాత్రమే చికిత్స అందించిన గాంధీ ఆస్పత్రి.. ఈ ఏడాది సైతం ఏప్రిల్ 17 నుంచి కొవిడ్ నోడల్ కేంద్రంగా సేవలు అందించింది. వేలాది మంది ప్రాణాలను నిలిపిన గాంధీ ఆస్పత్రి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం వల్ల సాధారణ సేవలు అందించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం ఆగస్టు 3 లోపు తగు ఏర్పాట్లు చేస్తామని, కొవిడ్ కేసుల చికిత్స కోసం ప్రత్యేకంగా వార్డులను కేటాయించనున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పష్టం చేశారు.  

ఇవీచూడండి:యాంటీబాడీలు తగ్గుతున్నా.. వైరస్‌ నుంచి రక్షణ!

Last Updated : Jul 27, 2021, 10:29 PM IST

ABOUT THE AUTHOR

...view details