దసరా నుంచి ధరణి ప్రారంభం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. పక్షం రోజుల గడువు పూర్తి కావస్తోన్నందున ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. పట్టణాలు, పల్లెల్లో అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆస్తుల వివరాలు యాప్లో నమోదు చేస్తున్నారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖ వద్ద ఉన్న ఆస్తిపన్ను సంఖ్య, ఇతర వివరాల ఆధారంగా వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్నారు. ప్రత్యేకించి యజమాని ఆధార్ సంఖ్య, కుటుంబసభ్యుల వివరాలు తీసుకుంటున్నారు. కుటుంబసభ్యుల తెలిపిన సమాచారాన్ని స్వీయధ్రువీకరణగా పరిగణిస్తున్నారు.
స్వచ్ఛందంగా చేసుకోవచ్చు..
ఇప్పటికే ఉన్న రికార్డుల్లో ఏవైనా తప్పులుంటే వాటిని సరిచేసేందుకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆస్తులు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆధార్ సంఖ్య ద్వారా ఓటీపీ వ్యాలిడేషన్ లేదా మీసేవా కేంద్రాల్లో ఈ-కేవైసీ సహాయంతో ప్రజలు స్వయంగా తమ ఆస్తుల వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇళ్లు, అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లు, దుకాణాలు, ఇతర వివరాలను యాప్లో పొందుపరుస్తున్నారు. నిర్మాణంతోపాటు ఖాళీ స్థలం వివరాలను కూడా పేర్కొంటున్నారు. ఖాళీ ప్లాట్ల నమోదు ప్రక్రియను మాత్రం ఇంకా చేపట్టలేదు. పురపాలక, పంచాయతీరాజ్ వద్దనున్న వివరాల ఆధారంగా యాప్లో ఆస్తులు నమోదు చేస్తున్నారు.