మూడు నెలలు విరామం తరువాత వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్‌లు చేసేందుకు వీలుగా సంస్కరణలు తీసుకొచ్చేందుకు సెప్టెంబరు 8న రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలుపుదల చేసింది. ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మొదలైనప్పటికీ.....ఇదే విధానంలో వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయం వచ్చేప్పటికి ఈ విధానంపై న్యాయస్థానంలో కొన్ని కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పాత విధానంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు సిద్దమైంది. అందులో భాగంగా గత మూడు రోజులుగా ఏర్పాట్లల్లో రిజిస్ట్రేషన్ శాఖ నిమగ్నమైంది.
రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పాత పద్ధతిన రిజిస్ట్రేషన్‌లు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ఆయా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సాప్ట్‌వేర్, హార్డ్‌వేర్, డిజిటల్ సిగ్నేచర్, నెట్‌వర్క్, పవర్ బ్యాక్ అప్ తదితర సౌకర్యాలు సక్రమంగా ఉన్నట్లు సంబంధిత అధికారుల నుంచి వివరాలు తెప్పించుకున్నారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్, పంచాయతీల నుంచి పొందిన ఆస్తి గుర్తింపు సంఖ్య ఉన్న ఆస్తులకు సంబంధించి మాత్రమే స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉన్నట్లు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వివరించారు.