తెలంగాణ

telangana

ETV Bharat / city

పదేళ్లుగా ఒకేచోట సబ్‌రిజిస్ట్రార్లు, ఇష్టారాజ్యంగా అవినీతి - పదేళ్లుగా బదిలీ కాని సబ్‌రిజిస్ట్రార్లు

No transfers of TS Sub Registrars రిజిస్ట్రేషన్‌ శాఖలో దీర్ఘకాలంగా బదిలీలు లేకపోవడంతో అంతులేని అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోంది. రాష్ట్రంలో 141 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉండగా, అందులో పావువంతు మంది సబ్‌ రిజిస్ట్రార్‌లు పది, అంతకన్నా ఎక్కువ ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారే. అవినీతికి అవకాశం ఉన్న శాఖ కావడం, కీలకమైన స్థానాల్లోని వారు ఉన్నచోటే పాతుకుపోవడంతో అవినీతి తారస్థాయికి చేరిందని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖే గుర్తించింది.

No transfers of TS Sub Registrars
No transfers of TS Sub Registrars

By

Published : Aug 30, 2022, 8:14 AM IST

No transfers of TS Sub Registrars for ten years : ప్రభుత్వ శాఖల్లో ప్రతి మూడేళ్లకు బదిలీలు సర్వ సాధారణం. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌శాఖ ఇందుకు పూర్తి మినహాయింపుగా ఉంది. తెలంగాణలో పదేళ్లుగా పూర్తిస్థాయిలో సబ్‌ రిజిస్ట్రార్ల బదిలీలు జరగలేదు. జిల్లా రిజిస్ట్రార్‌ల బదిలీలూ దశాబ్దకాలంగా లేవు. ఫలితంగా అత్యధికమంది అయిదు, పదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారానికి కీలకమైన, అక్రమాలు జరిగేందుకు ఆస్కారం అధికంగా ఉన్న హైదరాబాద్‌తోపాటు, రాజధాని నగరానికి చుట్టుపక్కల ఉన్న మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, యాదాద్రి జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సబ్‌ రిజిస్ట్రార్లలో అత్యధికులు అయిదేళ్లు అంతకంటే ఎక్కువకాలంగా విధులు నిర్వహిస్తున్నవారే.

Corruption in TS registration department : పూర్వపు ఐదో జోన్‌లో ఆగస్టు 2013లో బదిలీలు జరిగాయి. ఆరో జోన్‌లో మియాపూర్‌ కుంభకోణం జరిగినపుడు 2017లో బదిలీలు జరిగాయి. తర్వాత ఈ రెండు జోన్ల పరిధిలో సబ్‌రిజిస్ట్రార్ల సాధారణ బదిలీలు జరగలేదు. ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ పదేళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. ఖమ్మం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ (1), ములుగు సబ్‌రిజిస్ట్రార్‌ పదేళ్లుగా ఉన్నచోటే ఉన్నారు. ఖిలావరంగల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ 11 ఏళ్లుగా అక్కడే ఉన్నారు.

ఇక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కింది స్థాయి సిబ్బందిదీ అదే పరిస్థితి. వీరి బదిలీలు చివరిసారి 2010లో జరిగాయి. ఫలితంగా వీరంతా 12 ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయారు. పదోన్నతి వచ్చినా అదే కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వారూ ఉన్నారు. కొన్నిచోట్ల వింత పరిస్థితి ఉంది. జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ..సీనియర్‌ అసిస్టెంట్‌, తర్వాత సబ్‌రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొంది కూడా అదే కార్యాలయంలో కొందరు విధులు నిర్వహిస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, పెద్ద స్థాయి స్థిరాస్తి వ్యాపారులు తమకు అవసరమైన కార్యకలాపాలు కొనసాగించుకునేందుకే వారిని బదిలీలు చేయకుండా ఆపుతున్నారనే ఆరోపణలున్నాయి.

వ్యూహం ప్రకారం అక్రమాలకు ప్రణాళిక..ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు నెలవుగా మారాయి. కొందరు అక్రమమైన, నిబంధనలకు విరుద్ధమైన వాటిని ఇన్‌ఛార్జీ బాధ్యతలు నిర్వర్తించే సమయంలో జరిపించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ‘ఈ వ్యవహారం పక్కా వ్యూహంతో జరుగుతోంది. రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌లు ప్రణాళిక ప్రకారం దీర్ఘకాల సెలవులో వెళ్తారు. సీనియర్‌ అసిస్టెంట్‌ లేదా జూనియర్‌ అసిస్టెంట్‌కు బాధ్యతలు అప్పగిస్తారు. సగటున రోజుకు 10, 15 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయంలో ఆరోజు ఏకంగా 50 నుంచి 100 జరుగుతాయి. అందులో సింహభాగం నిబంధనలకు విరుద్ధమైనవే (ఎసైన్డ్‌ భూములను మరొకరి పేరుతో మార్చడం, అనుమతి లేని లేఅవుట్‌లలోని ప్లాట్లు, వివాదాస్పద, ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్‌ చేయడం వంటివి) ఉంటాయి. పరస్పర అంగీకారం మేరకు భారీ మొత్తం చేతులు మారుతాయి’’ అని అక్కడి సిబ్బందే చెబుతున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌గా వ్యవహరించిన సీనియర్‌ అసిస్టెంట్‌ ఇలా అక్రమ రిజిస్ట్రేషన్ల నేపథ్యంలో సస్పెండయ్యారు. మధిర ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ స్థలాన్ని మరొకరి పేరున రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యవహారంలో అక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌ సస్పెండవడం ఆ జిల్లాలో పరిస్థితికి నిదర్శనం.

అంతా ఇష్టారాజ్యం..మిగిలిన సిబ్బంది సంగతి అటుంచి..సబ్‌ రిజిస్ట్రార్లు ఎక్కువ కాలం ఒకేచోట పనిచేస్తున్న కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయి. పలువురు ప్రలోభాలకు గురవుతున్నారు. తాము తీసుకున్న నిర్ణయాలకు ఎదురులేకపోవడం, చేసిన రిజిస్ట్రేషన్లను మరొకరు పరిశీలించే అవకాశం లేకపోవడంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎంతో కొంత ముట్టజెబితేనే తప్ప పనులు చేయడంలేదని, పైపెచ్చు చేసేది లేదంటూ ముఖానే చెబుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, స్థిరాస్తి వ్యాపారులు వారిని బెదిరింపులకు గురిచేస్తూ..అనుకున్న పనులు జరిపించుకుంటున్నారనే విమర్శలూ ఉన్నాయి.

కీలక స్థానాల్లోనూ ఇన్‌ఛార్జులే దిక్కు..మహబూబ్‌నగర్‌, నల్గొండ వంటి జిల్లా కేంద్రాల్లో జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టులు భర్తీకి నోచుకోలేదు. దీంతో ఇన్‌ఛార్జీలే దిక్కయ్యారు. వల్లబ్‌నగర్‌ (బేగంపేట), బంజారాహిల్స్‌, ఉప్పల్‌, రాజేంద్రనగర్‌, నారపల్లి, గండిపేట, ఘట్‌కేసర్‌ వంటి కీలక ప్రధాన కార్యాలయాలు ఇన్‌ఛార్జీలతోనే నడుస్తున్నాయి. పూర్వపు ఆదిలాబాద్‌ జిల్లాలో నాలుగు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇన్‌ఛార్జీలే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details