ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పలువురిపై అభియోగాలు మోపడానికి ఉన్న ప్రాతిపదికపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని ఎక్కడ వస్తుందో గత ప్రభుత్వంలోని కొందరు కీలక వ్యక్తులకు ప్రాధమిక దశలోనే తెలుసు కాబట్టి, వారు...వారితో సంబంధమున్న వ్యక్తులు ముందుగానే తక్కువ ధరకు భూములు కొన్నారనేది ఆ అభియోగాల సారాంశం. రాజధాని ఎక్కడ రానుందో ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు బహిరంగంగా ప్రకటించిన తర్వాత జరిగిన కొనుగోళ్లను సైతం రాష్ట్ర ప్రభుత్వం అక్రమాల పరిధిలోకి తీసుకురావడం ఆశ్చర్యకరంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య ప్రాంతం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని తాము భావిస్తున్నట్లు 2014 జులై 22న రాష్ట్ర ప్రభుత్వం రాజధానిపై ఏర్పాటు చేసిన సలహా కమిటీ ఛైర్మన్, అప్పటి మంత్రి డాక్టర్ పి.నారాయణ దిల్లీలో తెలిపారు. ఈ విషయాన్ని అదే రోజు కేంద్రం రాజధానిపై ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్ కమిటీ సభ్యులకు చెప్పారు. ఈ అంశాలు మరుసటి రోజు పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి. విజయవాడ-గుంటూరు మధ్య రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం 2014 సెప్టెంబరు 1న నిర్ణయించింది.
శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున ఆరోజు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా ప్రసార సాధనాలు ప్రముఖంగా ఈ సమాచారాన్ని ప్రజలకు అందించాయి. మూడురోజుల తర్వాత నాలుగో తేదీన శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానికి జరిగిన స్థల ఎంపికపై అధికారికంగా ప్రకటన చేశారు. వివిధ అధ్యయనాల అనంతరం అమరావతి వద్దనే రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని పెట్టబోతున్నట్లు చాలా ముందుగా జులై2నే జాతీయ, స్థానిక పత్రికలూ ప్రముఖంగా ఇచ్చాయి.
ఒక ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్టు వస్తుందనే అనధికార సమాచారం పత్రికల్లో వస్తే దాన్ని బట్టి కూడా డబ్బున్నవారు ఆ ప్రాంతంలో భూములపై పెట్టుబడులు పెట్టడం సర్వసాధారణం. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వంలో రాజధాని వ్యవహారాలు చూసే మంత్రి స్పష్టంగా సంకేతాలు ఇచ్చాక, ఫలానాచోట రాజధానిని పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించాక జరిగిన క్రయవిక్రయాలనూ అక్రమంగా చూడటం ఎలా సమంజసమనే అభిప్రాయం పరిశీలకుల్లో కలుగుతోంది. ముఖ్యమంత్రి రాజధానిపై అధికారిక ప్రకటన చేశాక రెవెన్యూ అధికారులు సెప్టెంబరు రెండోవారం నుంచి భూముల పరిశీలనకు గ్రామాలకు వెళ్లారు. ఇక ఈ విషయంలో రహస్యం అనే మాటకు ఆస్కారం ఏముంది? ఆ పరిణామాల తర్వాత కొన్ని భూములు కొనుగోలు చేసిన వారిపైనా ప్రస్తుతం ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనే అభియోగం మోపారు.