తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏటా 10 రోజులు బడిసంచి లేని చదువు.. - no school bag policy

విద్యా సంవత్సరంలో కనీసం 10 రోజులు విద్యార్థులు బడిసంచి లేకుండా పాఠశాలలకు వచ్చేలా ‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’ అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. బడిసంచి బరువూ తక్కువగా ఉండాలని.. పిల్లల బరువులో 10 శాతం మించొద్దని పేర్కొంది.

no school bag policy -2020 in schools in India
ఏటా 10 రోజులు బడిసంచి లేని చదువు

By

Published : Dec 6, 2020, 8:29 AM IST

విద్యా సంవత్సరంలో స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ-2020ని తీసుకొచ్చిన కేంద్ర విద్యాశాఖ దాని అమలుకు చర్యలు తీసుకుని నివేదిక పంపాలని అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు తాజాగా లేఖలు రాసింది. ‘నో స్కూల్‌ బ్యాగ్‌’ రోజుల్లో విద్యార్థులకు క్విజ్‌, ఆటలు, పాటల పోటీలు లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలను ఇంకా తెరవలేదు. వాటిని తెరిచాకే కేంద్రం సూచనల అమలుకు అవకాశం ఉంది.

మద్రాస్‌ హైకోర్టు తీర్పుతో..

బడిసంచి బరువు తగ్గించేందుకు ఓ విధానం రూపొందించాలని.. దాని అమలు చర్యలు తీసుకోవాంటూ 2018 మే నెలలో మద్రాస్‌ హైకోర్టు ఓ కేసులో తీర్పు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏడుగురు నిపుణులతో అదే సంవత్సరం అక్టోబరులో ఓ కమిటీని నియమించింది. బడిసంచి బరువుపై దేశవ్యాప్తంగా 352 పాఠశాలలపై సర్వే నిర్వహించారు. అందులో తెలంగాణలోని 40 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. 1-5 తరగతుల బడిసంచులు ఉండాల్సిన బరువు కంటే 2-3 కిలోలు అధికంగా ఉంటున్నాయని సర్వేలో తేలింది.

సంచి బరువు సమస్యగా ఉందని 38.90 శాతం మంది ప్రధానోపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. దానిపై 77.70 శాతం మంది తల్లిదండ్రులు, 74.40 శాతం మంది పిల్లల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో రూపొందించిన కొత్త విధానంలో సంచి బరువుపై కేంద్రం పలు సూచనలు చేసింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి బడిసంచుల బరువు చూడాలంది. అందుకు డిజిటల్‌ తూకం యంత్రం సమకూర్చుకోవాలంది. సంచులను తనిఖీ చేసి తక్కువ బరువు ఉండేలా సూచనలు చేయాలని, అవసరం లేని వస్తువులు పంపవద్దని తల్లిదండ్రులకూ చెప్పాలని సూచించింది. ‘1, 2 తరగతులకు ఒకే నోట్‌బుక్‌ ఉండాలి. విద్యార్థులు పలచగా ఉండే పుటలతో కూడిన పుస్తకాలు వాడాలి. సంచి బరువుపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని’ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details