తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ డీజీపీ పేరుతో నకిలీ ఖాతా.. దర్యాప్తులో సహకరించని ట్విటర్ - కృష్ణా జిల్లా వార్తలు

‘డీజీపీ ఆంధ్రప్రదేశ్‌’ పేరిట ట్విటర్​లో ఓ నకిలీ ఖాతాను(fake dgp twitter account) గుర్తించిన పోలీసులు సామాజిక మాధ్యమ సంస్థ దృష్టికి తీసుకెళ్లడంతో దానిని నిలిపివేసింది. కానీ.. కేసు విచారణలో అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలంటూ చేసిన విజ్ఞప్తులకు వారినుంచి స్పందన మాత్రం లేదు. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు ట్విటర్‌ అధికారికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

fake twitter account, fake dgp account
నకిలీ ట్విటర్ ఖాతా, డీజీపీ పేరుతో ట్విటర్​లో నకిలీ ఖాతా

By

Published : Jun 20, 2021, 9:25 AM IST

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ పేరిట నకిలీ ట్విటర్‌ ఖాతా కేసుకు (fake dgp twitter account) సంబంధించి వివరాలివ్వాలని విజయవాడ పోలీసులు పంపిన మెయిల్‌ను ట్విటర్‌ పట్టించుకోలేదు. ఇప్పటికి మూడుసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన శూన్యం. ఖాతాదారుల సమాచారాన్ని పంచుకోలేమని నిరాకరించింది. గుర్తుతెలియని వ్యక్తులు ‘డీజీపీ ఆంధ్రప్రదేశ్‌’ అనే పేరుతో మూడు వారాల కిందట ట్విటర్‌లో నకిలీ ఖాతాను తెరిచారు. గౌతంసవాంగ్‌ ఫొటో కూడా పెట్టారు. పోలీసులు దీన్ని ట్విటర్ సంస్థ దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆ ఖాతాను తొలగించారు.

ఈ వ్యవహారంపై విజయవాడ సైబర్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఏ ఐపీ అడ్రస్​తో ఆ నకిలీ ట్విటర్‌ ఖాతాను సృష్టించారు? దీని వెనుక ఎవరున్నారు? ఏదైనా కుట్ర దాగుందా? అన్న కోణాల్లో విచారణ ప్రారంభించారు. కేసు ముందుకు సాగాలంటే ఐపీ చిరునామాకు సంబంధించిన వివరాలు అవసరం. వీటి కోసం పోలీసులు ట్విటర్‌ను మెయిల్‌ ద్వారా సంప్రదించారు. ఈ సమాచారం ఇవ్వడం సాధ్యం కాదని, తమ ఖాతాదారుల వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతుందని ఆ సంస్థ ప్రత్యుత్తరమిచ్చింది. దీనిపై పోలీసులు మరో మెయిల్‌ను పంపించినా స్పందన లేదు. దర్యాప్తులో లాగ్స్‌ కీలకమని, ఇవ్వకపోతే చట్టపరంగా ముందుకెళతామని మూడోసారి హెచ్చరించినా సమాధానం రాలేదు.

ప్రత్యామ్నాయాలపై అన్వేషణ..

కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌కు ఇప్పటివరకు ఐటీ చట్టం కింద ఇస్తున్న మినహాయింపులను ఇటీవల తొలగించింది. దీనివల్ల ట్విటర్‌లోని అన్ని అంశాలకు సంస్థ బాధ్యత వహించడమే కాదు.. చట్టపరంగా కేసులనూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం దర్యాప్తులో భాగంగా ఏదైనా సమాచారం అడిగితే ఇవ్వాలి. ఇప్పటికే దేశంలో పలుచోట్ల వివిధ కేసులకు సంబంధించి పోలీసులు ట్విటర్‌కు నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు కూడా సమాచారాన్ని రాబట్టుకునేందుకు ట్విటర్‌ అధికారికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details