కొవిడ్-19 వ్యాప్తి కట్టడి చర్యలను ప్రభుత్వం ఎంత కట్టుదిట్టం చేసినా హైదరాబాద్‌లోని కొన్ని సూపర్ మార్కెట్లలో నిబంధనల ఉల్లంఘన కనిపిస్తోంది. పౌరులకు ఇబ్బంది లేకుండా నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు, సూపర్ మార్కెట్లకు ఇచ్చిన సడలింపు కాస్త దుర్వినియోగం అవుతుందా అని అనుమానాలకు తావిస్తోంది. నిత్యావసరాల పేరుతో కొందరు పౌరులు చాక్లెట్లకని ఓ సారి, నూడిల్స్‌కని ఓసారి వచ్చి దుకాణంలో తిరిగి వెళ్తున్నారని సోమాజిగూడలోని ఓ సూపర్‌మార్కెట్ ప్రతినిధి తెలిపారు.
రోజంతా కిటకిటలాడుతున్నాయి..
వీధుల్లో ఉండే చిన్న దుకాణాల నిర్వాహకులు కొట్ల ఎదుట డబ్బాలు గీసి, కట్టెలు అడ్డుపెట్టి భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కువ మంది వచ్చే సూపర్ మార్కెట్లలో చాలావరకు ఈ ఏర్పాట్లు కనిపించడం లేదు. కేవలం శరీర ఉష్ణోగ్రత చూసి, శానిటైజర్ చేతిలో పోసి చేతులు దులుపుకొంటున్నారు. ఎక్కువ మందిని లోపలికి అనుమతించడంతో మాళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి.