తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుమల కొండపై పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా?

ఏపీ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావుడి.. కానీ తిరుమల కొండపై అలాంటి సందడే లేదు. ఎప్పుడైనా గమనించారా? తిరుమల క్షేత్రంలో పంచాయతీ ఎన్నికల జరుగుతాయా? లేదా? అని. కొండపై బాలజీ నగర్​లో 5 వేల మంది ఓటర్లు ఉన్నా.. అక్కడ సర్పంచి ఉంటారా? ఉంటే ఎవరు అనే విషయం ఆలోచించారా?

tirumala
తిరుమల కొండపై ఎన్నికలు జరుగుతాయా?

By

Published : Feb 3, 2021, 7:09 PM IST

ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమది..! 5వేల ఓటర్లు కలిగిన పంచాయతీ కూడా..! ఏపీ అంతా స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో తలమునకలై ఉంటే... అక్కడ మాత్రం... ఎప్పటి మాదిరిగానే నిశ్శబ్ద, నిర్మల వాతావరణం. ప్రచార హోరు లేదు, అభ్యర్థుల మాటల జోరూ లేదు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు తప్ప పంచాయతీ ఎన్నికలంటే ఎరుగని ప్రాంత కథేంటో చూద్దాం.

వంద మందితో ప్రారంభమై..

తిరుమలకు దశాబ్దాల ముందు నుంచే శ్రీవారి దర్శనానికి భక్తులు వస్తుండేవారు. దట్టమైన అటవీ ప్రాంతమవటంతో.... దర్శనానంతరం పొద్దుపోయేలోగా అందరూ కొండ దిగిపోయేవారు. రాత్రుల్లో ఆలయ పరిసరాలూ నిర్మానుష్యమయ్యేవి. ఆ సమయంలోనూ జనసంచారం ఉండేందుకు, ఆలయ పరిసరాలను నివాసయోగ్యంగా మార్చేందుకు కొందరిని ఉద్యోగులుగా, పనివారిగా నియమించారు. క్రమంగా ఆలయం చుట్టూ గ్రామం ఏర్పడింది. 1910లో వంద మందితో ఉన్న స్థానికుల సంఖ్య క్రమంగా 30వేలకు చేరుకుంది. శ్రీవారి పుష్కరిణి, ప్రస్తుతమున్న మాడవీధుల్లో ఇళ్లు ఉండేవి.

ఉత్సవాల వేళ..

భక్తుల రద్దీ గణనీయంగా పెరగడం వల్ల.. మాస్టర్ ప్లాన్‌ తయారు చేసి.. శ్రీవారి ఉత్సవాల వేళ.. వేలాది మంది వాహనసేవలను దర్శించుకునేలా మాడవీధులను విస్తరించారు. స్థానికుల ఇళ్లు ఖాళీ చేయించి.. వారికి తిరుపతిలో ఇళ్లను కేటాయించారు. మరికొందరు.. కొండపైనే బాలాజీనగర్‌లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం బాలాజీనగర్‌లో 1060, ఆర్​బీ కూడలిలో 81 ఇళ్లు ఉన్నాయి. ఒకప్పుడు 20వేల జనాభా ఉండగా.. 2019 ఓటర్ల జాబితా ప్రకారం 5,164కి తగ్గిపోయింది.

కోర్టుకు వెళ్లినా..

ఐదు వేల మంది ఓటర్లతో తిరుమల గ్రామ పంచాయతీ అయినప్పటికీ ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరగవు. దేవాదాయ శాఖ చట్టం కింద అలిపిరి నుంచి కొండపై ప్రత్యేక ప్రదేశంగా పరిగణించారు. 1964లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టిన నర్సింగరావ్‌నే తొలుత పంచాయతీ అధికారిగా నియమించారు. అప్పటినుంచి తితిదే ఈవోగా నియమితులైన వారే తిరుమల పంచాయతీ అధికారిగా కొనసాగుతున్నారు. కొన్నేళ్ల క్రితం పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని స్థానికులు కోర్టుకు వెళ్లినప్పటికీ న్యాయస్థానం ఆ కేసును కొట్టివేసింది.

స్థానిక పాలన లేకపోవడంతో..

ప్రస్తుతం తిరుమల స్థానికులు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రమే భాగస్వాములవుతారు. స్థానిక పాలన లేకపోవడంతో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చాలా కాలంపాటు తిరుమల వాసులకు దక్కలేదు. కొన్నేళ్లగా రేషన్‌తోపాటు, ప్రభుత్వ పెన్షన్లను అందిస్తున్నారు.

ఇదీ చదవండి:రాజకీయ ప్రయోజనాల కోసమే కేసులో ఇరికించారు: భార్గవ్​రామ్

ABOUT THE AUTHOR

...view details